Site icon HashtagU Telugu

Allu Arjun’s Award : అల్లు అర్జున్ అవార్డు వెనుక రాజకీయాలు ఉన్నాయా?

Allu Arjun Statue

Is There Politics Behind Allu Arjun's Award

By: డా.ప్రసాదమూర్తి

Allu Arjun’s Award : దాదాపు 7 దశాబ్దాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవరికీ దక్కని అపూర్వ గౌరవం అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. 69వ జాతీయస్థాయి చలనచిత్రాల పురస్కారాల ప్రకటనలో అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు లభించింది. ఇది తెలుగువారికి సంతోషదాయకం. ఆనందించాల్సిన విషయమే. అయితే ఇంతకాలం తెలుగు వారి పట్ల, తెలుగు సినిమాల పట్ల అంత నిశ్శబ్దాన్ని, ఉదాసీనతను పాటించిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి తెలుగువారి మీద అవార్డుల వర్షం ఎందుకు కురిపించింది? ఇదే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఇదే చర్చనీయమైన విషయం కూడా మారింది. కొంచెం లోతుకి వెళ్లి ఆలోచిస్తే విషయం ఏమంత అర్థం కాని కఠినమైందీ, జఠినమైందీ కాదు.

కేంద్రం ప్రకటించే ఏ రంగానికి సంబంధించిన పురస్కారాలైనా వివాదానికి చోటు ఇవ్వకుండా ఎప్పుడూ జరగలేదు. అది రాను రాను ఒక ఆచారంగా సంప్రదాయంగా మారిపోయింది. పద్మ పురస్కారాలు కావచ్చు, సాహిత్య అకాడమీ పురస్కారాలు కావచ్చు, సినీ పురస్కారాలు కావచ్చు, ఏమైనా సరే వాటి వెనక తప్పనిసరిగా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలను, ఉద్దేశాలను నెరవేర్చుకోవడం అతి సాధారణ విషయంగా మారిపోయింది. ఈ వెలుగులో చూస్తే అల్లు అర్జున్ (Allu Arjun) కి వచ్చిన అవార్డుని అర్థం చేసుకోవచ్చు.

అల్లు అర్జున్ వాస్తవానికి మంచి నటుడు. ఆయనకు కేవలం తెలుగులోనే కాదు, దక్షిణాది భాషల్లో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమాతో ఆయన దేశవ్యాప్త ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ పుష్ప సినిమాలో అతని పాత్ర ఉత్తమ నటుని పురస్కారానికి అర్థమైంది కాదన్నదే పలువురి విమర్శ. దేశానికి ప్రజలకు హాని చేసే స్మగ్లింగ్ కీలకంగా ఆ పాత్ర ఉంటుంది. మరి దశాబ్దాలుగా తెలుగు చలనచిత్రంలో ఏ నటుడుకీ దక్కని ఇంత గొప్ప గౌరవం అల్లు అర్జున్ (Allu Arjun) కి ఇప్పుడు ఎందుకు దక్కింది? ఇది కీలకమైన అంశం. మరో 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ రాజకీయ సమీకరణలు వేగంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తులో ఉన్నాడు. కాపు సామాజిక వర్గం ఆయన వెనుక ఉంది.

పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, చిరంజీవి కుటుంబాలు తమ పట్ల విధేయంగా ఉంటే కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా తమ వెనుక ఉంటుందని భారతీయ జనతా పార్టీ భావించడం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి ఈ అవార్డు వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది కదా. అలాగే RRR కి ఆరు అవార్డులు ప్రకటించి కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని మరో బలమైన సామాజిక వర్గాన్ని కూడా బుజ్జగించే పని చేసింది. ఇప్పటికే ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న RRR ఈ అవార్డులకు అర్హమే అని ఎవరైనా వాదించవచ్చు. తప్పులేదు. కానీ ప్రతి అవార్డు వెనుక ప్రభుత్వానికి ఒక ఉద్దేశం ఉంటుందన్నది మనం గమనించాలి.

ఇలా ఇటీవల ప్రకటించిన ప్రకటించిన జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డుల పుట్టకదిలిస్తే, అనేక రాజకీయ కోణాల, ఏలిన వారి ప్రయోజనాల ఎలుకలు ఎన్నో లుకలుకమని బయటపడతాయి.

Also Read:  Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు జాతీయ సమగ్రతా పురస్కారమా?