IMDb’s Most Popular Indian Stars of 2024 : ఐఎండీబీ 2024 సంవత్సరానికి గాను టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నెం.1 స్థానంలో త్రిప్తి డిమ్రీ నిలిచింది. “బ్యాడ్ న్యూజ్”, “విక్కీ విద్యా కా వో వాలా వీడియో” మరియు “భూల్ భులైయా 3” సినిమాలతో ఆమె 2024లో భారీ గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్న త్రిప్తి, ఐఎండీబీ యొక్క వీక్లీ ర్యాంకింగ్స్ లో కూడా నిలకడగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితా భారతీయ సినిమా రంగంలోని విభిన్నతను చూపిస్తుంది. దీపికా పదుకొణె, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి సీనియర్ తారలు, శార్వరి మరియు ఇషాన్ ఖట్టర్ వంటి కొత్త నటులు ఇందులో చోటు దక్కించుకున్నారు. ఐఎండీబీ ఇండియా హెడ్ యామిని పటోడియా ఈ జాబితా ప్రేక్షకుల అభిరుచులను ప్రతిబింబిస్తుందని, భారతీయ నటుల అంతర్జాతీయ ఆకర్షణ పెరుగుతున్నదని తెలిపారు.
ఈ ఏడాది దీపికా పదుకొణె రెండవ స్థానంలో నిలిచింది. “ఫైటర్”, “కల్కి 2898 A.D”, “సింగం ఎగైన్” సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా “కల్కి 2898 A.D” సినిమాతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇషాన్ ఖట్టర్ (నెం.3) తన అంతర్జాతీయ టీవీ సిరీస్ “ది పర్ఫెక్ట్ కపుల్” ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. తెలుగు నటీమణి శోభిత ధూళిపాళ (నెం.5) ఈ ఏడాది “మంకీ మ్యాన్” అనే హాలీవుడ్ చిత్రంతో తన మొదటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో నటించి గుర్తింపు పొందింది. అంతేకాకుండా, “కల్కి 2898 A.D”లో దీపికా పదుకొణెకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆమె ప్రస్తుతం తెలుగు హీరో నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది.
ఈ జాబితాలో సమంత (నెం.8) మరియు ప్రభాస్ (నెం.10) స్థానం పొందారు. ప్రత్యేకంగా ప్రభాస్ ప్రస్తుతం “సలార్” మరియు “కల్కి 2898 A.D” సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఐఎండీబీ టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల వీక్షణల ఆధారంగా రూపొందించబడింది.
Read Also : Global Climate Action Movement : తెలంగాణలో ప్రారంభమైన 1.5 మేటర్స్ వాతావరణ కార్యక్రమం