సోషల్ మీడియా ప్రభావంతో తక్కువ కాలంలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకున్నవారిలో సుష్మా భూపతి ఒకరు. కేవలం ఒకే ఒక్క వైరల్ వీడియోతో అనూహ్యమైన గుర్తింపు సాధించిన ఆమె, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 9 లక్షల మంది ఫాలోవర్లతో స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, విభిన్న రకాల వీడియోలు, రీల్స్‌తో తన ఫాలోవర్లను అలరిస్తున్న సుష్మా, పలు బ్రాండ్‌లకు ప్రమోషన్స్ చేస్తూ గణనీయమైన ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఈ పాపులారిటీ కారణంగా ఆమె వివిధ వేదికలపై, ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, ఆదాయం, పిల్లల భవిష్యత్తు గురించి, ముఖ్యంగా సినీ పరిశ్రమలోని ‘కమిట్‌మెంట్’ అంశంపై సంచలన విషయాలు వెల్లడించారు.
తన జీవితంలో డబ్బు సంపాదన లక్ష్యం గురించి సుష్మా భూపతి ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. తాను డిప్రెషన్ నుంచి బయటపడటం కోసమే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చానని, ఆ తర్వాత ప్రమోషన్స్ ద్వారా డబ్బు సంపాదించడంపై మనసు మళ్లిందని నిజాయితీగా అంగీకరించారు. “డబ్బును ఎవరు కాదనుకుంటారు? అందరూ ఆశాజీవులే కదా. కానీ ఈ నిజాన్ని బయట ఎవరూ ఒప్పుకోరు” అని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. ప్రారంభంలో తన వీడియోలకు వచ్చే ఘోరమైన, అసభ్యకరమైన కామెంట్లు చూసి తీవ్రంగా బాధపడేదానినని, హోమ్లీగా శారీలో రీల్స్ చేసినా నెగెటివ్ కామెంట్లు వచ్చేవని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ కామెంట్లను పట్టించుకోవడం పూర్తిగా మానేశానని, పాజిటివ్, నెగెటివ్ రెండింటినీ స్వీకరిస్తానని వివరించారు.
సుష్మా భూపతి తన పిల్లల భవిష్యత్తు కోసం తన సోషల్ మీడియా కెరీర్‌కు పూర్తి విరామం ఇవ్వాలని నిర్ణయించుకోవడం ఈ ఇంటర్వ్యూలో అత్యంత కీలకమైన అంశం. తన పిల్లలు పెద్దవారవుతున్నందున, ముఖ్యంగా కుమార్తెకు రెండేళ్లలో అన్నీ అర్థం చేసుకునే వయసు వస్తుందని భావించి, అప్పటిలోగా ప్రస్తుతం చేస్తున్న వీడియోలను పూర్తిగా ఆపేస్తానని స్పష్టం చేశారు. “పిల్లల ఫ్యూచర్‌కు ఎఫెక్ట్ కాకుండా.. వీడియోలు క్లోజ్ చేసేయటం బెస్ట్” అని ఆమె నిర్ణయించుకున్నారు. అంతేకాక, సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా ధైర్యంగా వెల్లడించారు. ఇటీవల ఓ మూవీ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి, ఛాన్స్ కావాలంటే ఇన్‌డెరెక్ట్‌గా కమిట్‌మెంట్ అడిగాడని, అయితే తాను తన భర్త ముందే స్పీకర్ ఆన్ చేసి ఆ సంభాషణను రికార్డు చేసినట్లు తెలిపారు. తన లక్ష్యం అక్రమ పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించడం కాదని, బుద్వేల్‌లో కొనుకున్న స్థలంలో ఇల్లు కట్టుకోవడమే అని, అందుకోసం తన మనసు చంపుకుని అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని ఆమె దృఢంగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టాయి.
