Kangana Vs Kulwinder : ఇటీవల బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చెంపదెబ్బ కొట్టిన వ్యవహారం కలకలం రేపింది. రైతు ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడినందుకు.. రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేసినందుకే కంగనను చెంపదెబ్బ కొట్టానని కుల్విందర్ కౌర్ ప్రకటించారు. ‘‘కంగనా రనౌత్ కామెంట్స్ చేసిన రైతు ఉద్యమంలో మా అమ్మ కూడా పాల్గొంది. మహిళలంతా చెరో రూ.100 తీసుకున్న తర్వాతే రైతు నిరసన కార్యక్రమాలలోకి వచ్చి కూర్చున్నారు అని గతంలో కంగన చేసిన కామెంట్స్ నన్ను బాధపెట్టాయి. అందుకే ఆమెను చూడగానే కొట్టాను’’ అని కుల్విందర్ తెలిపారు. ఇప్పటికే కుల్విందర్‌ను సీఐఎస్‌ఎఫ్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది. ఈ తరుణంలో కంగనా రనౌత్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా కంగనకు మద్దతు ప్రకటించిన వారిలో బాలీవుడ్ దిగ్గజ నటులు హృతిక్ రోషన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా, జోయా అక్తర్, సోనీ రజ్దాన్, అర్జున్ కపూర్, ప్రజక్తా కోలీ కూడా చేరారు. వీరంతా కంగనకు మద్దతుగా ట్వీట్స్ చేశారు. నిరసన తెలపడానికి చాలా శాంతియుత మార్గాలు ఉంటాయని.. కంగనను కుల్విందర్ చెంపదెబ్బ కొట్టడం సరికాదని వారంతా అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కంగనను ఇలా అవమానించడం సరికాదని బాలీవుడ్ దిగ్గజ నటులు అంటున్నారు. ఇప్పటికే అనుపమ్ ఖేర్, మికా సింగ్, రవీనా టాండన్, శేఖర్ సుమన్ సహా పలువురు ప్రముఖులు కూడా ఈ ఘటనను ఖండించారు. కంగనకు మద్దతుగా నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join
ఆ పోస్టుకు లైక్స్
ఈ ఘటనపై జర్నలిస్ట్ ఫయే డిసౌజా ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.. ‘‘నిరసన తెలపడానికి హింస ఎప్పటికీ సమాధానం కాదు’’ అని అందులో స్పష్టం చేశారు. ‘‘మనది గాంధీ పుట్టిన దేశం. మనం ఇతరుల అభిప్రాయాలతో విభేదించవచ్చు. కానీ హింసకు పాల్పడకూడదు. హింసతో ఎదుటివారికి సమాధానం చెప్పకూడదు’’ అని పరోక్షంగా కానిస్టేబుల్ కుల్విందర్‌కు హితవు పలికారు. ‘‘ ప్రభుత్వ యూనిఫాంలో ఉండగా.. కుల్విందర్ అలా ప్రవర్తించడం చాలా ప్రమాదకరం’’ అని చెప్పారు. జర్నలిస్ట్ ఫయే డిసౌజా పోస్టును లైక్ చేసిన వారిలో హృతిక్ రోషన్, ఆలియా భట్, అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా, జోయా అక్తర్, సోనీ రజ్దాన్ ఉన్నారు.