చిత్రసీమను భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాడు ఒక్కడు చాలు !!

ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ స్వయంగా బూతు పదజాలంతో కూడిన పాటను పాడటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది

Published By: HashtagU Telugu Desk
Chandrahas Song

Chandrahas Song

Hero Chandrahas Controversy Song : తెలుగు చిత్ర పరిశ్రమను రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ , మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంటే, కొందరు వర్ధమాన నటులు తమ ప్రవర్తనతో పరిశ్రమ పరువు తీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ స్వయంగా బూతు పదజాలంతో కూడిన పాటను పాడటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. సభ్య సమాజం ఛీ కొట్టేలా ఉన్న ఆ పాట సాహిత్యంపై సినీ ప్రియులు మరియు సామాన్యులు మండిపడుతున్నారు.

ఈ వ్యవహారం కేవలం పాటతోనే ఆగకుండా మరింత ముదిరి పోలీసు కేసు వరకు వెళ్లింది. చంద్రహాస్ పాడిన అభ్యంతరకర పాటపై ఒక జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేయగా, దానికి స్పందనగా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ చంద్రహాస్ మరో వీడియోను విడుదల చేశారు. తనను విమర్శించిన వారిపై పరుష పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా, పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడంతో సదరు జర్నలిస్ట్ అప్రమత్తమయ్యారు. చంద్రహాస్ నుండి తనకు ప్రాణహాని ఉందని భావించిన ఆయన, వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రహాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే క్రమశిక్షణ, వినయం ముఖ్యం అని, ఇలాంటి బూతు పాటలు, బెదిరింపులతో పబ్లిసిటీ పొందాలనుకోవడం మూర్ఖత్వమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “ఇలాంటి వారు హీరోలా? వీరి సినిమాలు చూడాలా?” అంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఒకవైపు స్టార్ హీరోలు తమ నటనతో, వ్యక్తిత్వంతో దేశానికి గర్వకారణంగా నిలుస్తుంటే, మరోవైపు ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం విడుదల ముందే ప్రతికూలతను మూటగట్టుకున్నట్లయింది.

  Last Updated: 05 Feb 2026, 09:19 AM IST