తెలుగు యాక్షన్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’పై విశేషాలు వెల్లడించారు. ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నారని, ప్రతి రూపానికి ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలు రూపొందించామని చెప్పారు. హిమాలయాల చలిలో కూడా బాలకృష్ణ స్వయంగా 99 శాతం ఫైట్లు చేసినట్టు తెలిపారు. ‘అఖండ’లోని అఘోరా పాత్ర ఈసారి విశ్వరూపాన్ని చూపిస్తుందని, కుంభమేళా నేపథ్యంలో ఉన్న ఘట్టాలు గ్రాండ్‌గా ఉంటాయని రామ్-లక్ష్మణ్ అన్నారు .
తెలుగు సినీ పరిశ్రమలో తమ యాక్షన్ కొరియోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవల సోదరులు చెల్లా రామ్ – చెల్లా లక్ష్మణ్, సినీ ప్రేమికులకు రామ్-లక్ష్మణ్ పేరుతో బాగా పరిచయం. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ ద్వయం గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్రాల్లో అగ్రశ్రేణి యాక్షన్ సన్నివేశాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. విక్రమ్ ధర్మ నుంచి పీటర్ హెయిన్, స్టంట్ సిల్వా నుంచి అన్బరీవ్ వరకు పలువురు ఫైట్ మాస్టర్లతో కలిసి పనిచేసిన వీరు, నైపుణ్యం, శ్రమ, కొత్త పద్ధతుల మీద ఆసక్తితో సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆరు సార్లు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకోవడం, ఫైట్ మాస్టర్స్‌లో వీరి పట్టు ఏ స్థాయిలో ఉందో చెబుతుంది. కేవలం కొరియోగ్రాఫర్లుగానే కాకుండా, ‘యాక్షన్ నెం.1’, ‘ఒక్కడే (కాని ఇద్దరు)’ వంటి చిత్రాల్లో నటులుగా కూడా గుర్తింపు పొందారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న ‘ అఖండ 2 : తాండవం’ చిత్రానికి వీరే యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ‘అఖండ 2’ గురించి తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఈ చిత్రం తమ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైందని రామ్-లక్ష్మణ్ వెల్లడించారు. ‘‘బాలకృష్ణ గారి సినిమాలతో మాకు ఎప్పటి నుంచో అనుబంధం. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో పనిచేసినప్పుడల్లా ఆయనకున్న ఎనర్జీని చూసి మేము ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ‘అఖండ 2’ సెట్లో కనిపించిన బాలయ్య మరింత దైవికమైన శక్తిలా అనిపించారు’’ అని రామ్ తెలిపారు.
ఈసారి బాలయ్య మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నందున, ప్రతి రూపానికి సరిపోయేలా వేర్వేరు యాక్షన్ స్టైల్స్ రూపొందించాల్సి వచ్చిందట. ‘‘యాక్షన్ విషయంలో ఎక్కడా రాజీపడకూడదని బోయపాటి గారు స్పష్టంగా చెప్పారు. అందుకే ప్రతి ఫైట్ బ్లాక్‌నే పెద్ద స్థాయిలో తెరకెక్కించాం. ‘అఖండ’లో పరిచయమైన అఘోరా పాత్ర ఈసారి విశ్వరూపాన్ని చూపుతుంది. ఆ శక్తి ఎలా ఉండాలి? దానికి తగ్గ యాక్షన్ ఎలా ఉండాలి? అనే విషయాల్లో బలమైన ఆలోచన చేసి ఫైట్లు డిజైన్ చేశాం’’ అని లక్ష్మణ్ వివరించారు.
హిమాలయాల్లో జరిగిన షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ చూపించిన నిబద్ధతని ఈ సోదరులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘మేము చలికి వణికిపోయి కోట్లు వేసుకునే పరిస్థితి. కానీ బాలయ్య మాత్రం పాత్రకు తగ్గట్టే భుజాలు బయట కనిపించే దుస్తులతోనే గంటల తరబడి షూట్ చేశారు. ఆయనలో పాత్రపై ఉన్న లీనతను చూస్తే మాకు పనిచేసే ఉత్సాహం రెట్టింపు అవుతుంది’’ అన్నారు.
‘అఖండ 2’లోని చాలా యాక్షన్ సన్నివేశాలను బాలకృష్ణ స్వయంగా చేశారని, 99 శాతం ఫైట్లలో బాడీ డబుల్స్ అవసరం పడలేదని రామ్-లక్ష్మణ్ చెప్పారు. ‘‘అభిమానులు హీరోని రియల్‌గా చూడాలనుకుంటారు. ఆ అంచనాలను బాలయ్య ప్రతి సినిమాతో పెంచుతుంటారు. ఈసారి పాన్-ఇండియా స్థాయిలో సినిమా రూపొందుతున్నందున ప్రతి సన్నివేశం భారీ స్థాయి హంగులతో రూపొందించబడింది. ముఖ్యంగా కుంభమేళా నేపథ్యంలో తీర్చిదిద్దిన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది’’ అంటూ వెల్లడించారు.
తాజా యాక్షన్ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా తమ పని కూడా అప్‌డేట్ అవుతుందని, తమ తరువాత తరంగా కుమారుడు రాహుల్ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడని రామ్, లక్ష్మణ్ చెప్పారు. ‘‘కొత్త ఆలోచనలతో మా అబ్బాయి రాహుల్ సలహాలు ఇస్తుంటాడు. త్వరలోనే యాక్షన్ డైరెక్టర్‌గా అతడ్ని పరిచయం చేయనున్నాం’’ అని అన్నారు. డిసెంబరు 5న విడుదల కానున్న ‘అఖండ 2: తాండవం’, బాలకృష్ణ – బోయపాటి – రామ్-లక్ష్మణ్ కాంబినేషన్ మరోసారి అఖండ విజయాన్ని సాధిస్తుందని సినీ వర్గాలతో పాటు బాలయ్య ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
