OMG : బడిలో హస్త మైధునం.. ఓ మై గాడ్!

సినిమా (OMG - 2) మొత్తం మూడు వంతులు కోర్టు సీనులో నడుస్తుంది. తన కొడుకు తరఫున ఆ తండ్రి 'కాంతి' కోర్టులో వాదిస్తాడు.

  • Written By:
  • Updated On - August 29, 2023 / 11:34 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Oh My God  (OMG): సత్యం నగ్నంగా ఉంటుంది. దాన్ని దర్శించడానికి సిగ్గుపడడం దేనికి? అలా సత్యాన్ని చూడడానికి సిగ్గుపడేవారు, అసహ్యించుకునేవారు, ఆచారం.. సంప్రదాయం, నీతి.. అవినీతి పేరు మీద కళ్ళు మూసుకునేవారు భావితరాలకు మహాపకారం చేస్తున్నారు. ఇది ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైన OMG 2 సినిమా సందేశం.

ఈ విషయాన్ని ఇంకా నగ్నంగా చెప్పాలంటే, బడుల్లో, ఇళ్లల్లో బాల్య దశ నుంచే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ సకాలంలో అందిస్తే, వారు ఎలాంటి అపోహలకు, ప్రమాదాలకు, భయాలకు గురికాకుండా స్వచ్ఛంగా ఎదుగుతారని రెండు గంటల ఈ సినిమా దేశమంతటికి ఒక నిండిన సందేశాన్ని ఇచ్చింది.

కథ సింపుల్. వివేక్ అనే ఒక కుర్రవాడని, అతని మర్మాంగం చిన్నదని, అందుకే డాన్స్ షోలో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని, తోటి విద్యార్థులు వెక్కిరిస్తారు. వివేక్ ఇక తన మర్మావయవాన్ని పెద్దది చేసుకునే అన్ని మార్గాలనూ అన్వేషిస్తాడు. ఈ క్రమంలో డాక్టర్లు, వీధి వైద్యులు, మందుల షాపులు వాళ్ళు ప్రజల్ని, ముఖ్యంగా యువతను ఎలా మాయ చేసి మోసం చేస్తున్నారో తెలియకుండానే వారి వలలో చిక్కుకుపోతాడు. చివరికి హస్త(ప్రయోగం) మైధునం చేసుకుంటూ బడిలో తోటి పిల్లలకు చిక్కిపోతాడు. అది దొంగ చాటుగా వీడియో తీసి, దాన్ని పిల్లలు వైరల్ చేసి, వివేక్ ని, అతని కుటుంబాన్ని నడిరోడ్డున అపహాస్యం పాలు చేస్తారు‌. ఇది బయటపడి స్కూల్ నుంచి వివేక్ ని తొలగిస్తారు. నవ్వుల పాలైన కుటుంబం ఒక్కసాగరంలో మునిగిపోతుంది. వివేక్ తండ్రి పరమ శివ భక్తుడు, ఆచార పరాయణుడు. కానీ సాక్షాత్తు శివుడే తనను ఆదుకోవడానికి రావడంతో, కొడుకును రక్షించుకోవడానికి కోర్టుకు ఎక్కుతాడు.

సినిమా మొత్తం మూడు వంతులు కోర్టు సీనులో నడుస్తుంది. తన కొడుకు తరఫున ఆ తండ్రి ‘కాంతి’ కోర్టులో వాదిస్తాడు. స్కూల్ తరఫున డిఫెన్స్ లాయర్ గా ‘కామిని’ వాదిస్తుంది. మన ప్రాచీన సాహిత్యమైన పంచతంత్ర, కామసూత్ర మొదలైన గ్రంథాలు శతాబ్దాల క్రితమే మన దేశంలో లైంగిక విద్యను బోధించాయని, అప్పుడు తప్పు లేనిది ఇప్పుడు ఎందుకు తప్పైందని వివేక్ తండ్రి కాంతి వాదన. అత్యంత ఆసక్తిగా, మేధోమథనంగా, నీతి.. అవినీతి, ఆచారం.. అనాచారం మధ్య తీవ్ర సంఘర్షణగా ఈ వాదోపవాదాలు సాగుతాయి. చివరికి జడ్జిగారు వివేక్ తండ్రిని విజేతగా ప్రకటిస్తారు‌. స్కూలు అనివార్యంగా వివేక్ ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో తప్పనిసరిగా చేయాలన్న ఆదేశం, కోర్టు ద్వారా మొత్తం దేశానికి అందుతుంది.

మనం పిల్లలకు ఏది దూరంగా ఉంచాలో దాన్ని అతి దగ్గరగా ఉంచుతాం. దేన్ని పిల్లలకు దగ్గరగా ఉంచాలో దాన్ని దూరంగా ఉంచుతాం. లైంగిక విషయాలలో పిల్లలతో మనం వ్యవహరించే తీరు ఇది. దీంతో సమాజంలో తరాలుగా యువతీ యువకుల మెదళ్ళలో లైంగిక సమస్యల పట్ల సదవగాహన లేకపోవడం వల్ల అనేక వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దేవుడు చెప్తే గాని మనవాళ్లు దేన్నీ నమ్మరు. అందుకే ఈ సినిమాలో సాక్షాత్తు శివుడే వివేక్ ని, అతని కుటుంబాన్ని మొత్తాన్ని ఆదుకోవడానికి రంగంలోకి దిగినట్టు డైరెక్టర్ స్క్రీన్ ప్లే తయారు చేసుకోవడం గొప్ప వ్యూహాత్మక వైజ్ఞానిక ఎఫర్ట్ గా చెప్పుకోవాలి. ఇప్పటికీ 90 శాతం మంది పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పాపం అని వాదించేవారు ఉన్నారు. కానీ సెక్స్ కి దూరంగా ఏ పిల్లవాడూ, ఏ పెద్దవాడూ ఉండరని వారికి తెలియదా? ఇదంతా ఒక బహిరంగ రహస్యమే. అందుకే శివుడు ప్రశ్నించమంటాడు. ప్రశ్నిస్తే ప్రశ్న పుడుతుందని, ప్రశ్న పుడితే జవాబు దొరుకుతుందని, జవాబు నుంచి మరో ప్రశ్న పుడుతుందని, మరో ప్రశ్న నుంచి మరో ప్రశ్న.. మరో ప్రశ్న నుంచి మరో జవాబు.. ఇలా ప్రశ్న నుంచి జవాబు, జవాబు నుంచి ప్రశ్న ద్వారానే ఒక జాతి మొత్తం చైతన్యవంతమవుతుందని శివుడి ద్వారా డైరెక్టర్ అమిత్ రాయ్ దేశానికి చెప్పించాడు. హస్త(ప్రయోగం) మైధునం మగవారిలో 92 శాతం, ఆడవారిలో 73% సహజంగా జరిగే ప్రక్రియ అని, దానివల్ల నష్టం ఏమీ లేదని లైంగిక శాస్త్రజ్ఞులతో కూడా చెప్పించాడు.

సో.. ఏ వయసులో ఏ జ్ఞానం అందాలో, ఆ వయసులో ఆ పరిజ్ఞానం పిల్లలకు అందినప్పుడే వారు ఆరోగ్యంగా పెరిగి, తమ చుట్టూ ఉన్న అజ్ఞానపు అంధకారాన్ని పటాపంచలు చేసుకొని, తమ భవిష్యత్తును వెలుగుదారుల వైపు నడిపించుకుంటారు. ఏది తప్పు.. ఏది ఒప్పు.. ఏది పాపం.‌. ఏది పుణ్యం.. ఏది నీతి.. ఏది కాదు.. ఈ విచక్షణా జ్ఞానం బాల్య దశలోనే పిల్లవాడికి అందాల్సిన చోట అందితే, వివేక్ బడిలో ఆ పని చేసే వాడే కాదు. విద్య అంటే కేవలం ఉపాధి సంపాదించే మార్గమే కాదు. వ్యక్తిత్వాన్ని వైజ్ఞానికంగా నిర్మించుకునే గొప్ప సాధనం అని తెలుసుకోవాలి. ఈ విషయంలో విద్యావ్యవస్థలో మౌలిక మార్పులు జరగాలి. పాలకులు, పాఠ్య గ్రంథాల నిర్మాతలు, విద్యావ్యవస్థను నడిపే నిపుణులు అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఈ విషయం మీద దృష్టిపెట్టేటట్టు ఒక సినిమా చేసిందంటే, సినిమా ఎంతటి బలమైన సాధనమో మనకు అర్థమవుతుంది. అందుకే OMG 2 నిర్మాతలందరిని, వారిలో ఒకడై, శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ని, దర్శకుడు అమిత్ రాయ్, ప్రధాన పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠి, డిఫెన్స్ లాయర్ పాత్ర పోషించిన యామి గౌతమ్ అందరినీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది అశ్లీల సినిమా కాదు. అసలైన శీలం ఏమిటో, దాన్ని ఎలా మలుచుకోవాలో మనకు బోధించిన సినిమా.

Also Read: Telugu Language Day 2023 : అమ్మ ప్రేమలా కమ్మనైనది తెలుగు భాష