Site icon HashtagU Telugu

Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై మూడు రౌండ్ల కాల్పులు

Salman Khan

Salman Khan

Salman Khan :ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌‌కు చెందిన ముంబైలోని నివాసం వద్ద కాల్పులు కలకలం రేపాయి.  ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఖాన్‌కు(Salman Khan) చెందిన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.  బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.. మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారని ముంబై పోలీసులు వెల్లడించారు. దీనిపై సమాచారం అందిన వెంటనే ముంబై  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల టీమ్  కూడా విచారణ మొదలుపెట్టింది.

2023 మార్చిలో ఏం జరిగిందంటే.. 

గత ఏడాది మార్చిలో సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈ-మెయిల్ అందింది. ఆ తర్వాత ముంబై పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ టాప్‌- 10 టార్గెట్ల లిస్టులో  సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నారని గతేడాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా హెచ్చరించింది. దీంతో ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు  వై ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన సల్లూభాయ్  ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు.

We’re now on WhatsApp. Click to Join

రాజధానిలోనే ఇలా ఉంటే.. 

ఈ ఘటనపై శివసేన (ఉద్ధవ్) నేత ఆనంద్ దూబే స్పందిస్తూ.. ‘నేరస్తులు నిర్భయంగా తిరుగుతున్నారు’ అంటూ ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై మండిపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే ప్రజలకు భద్రత లేకుంటే.. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  ‘‘ఇటీవల ముంబైలోని డోంబివాలిలో ఎమ్మెల్యేపై కాల్పులు జరిగాయి. ఇది ఎలాంటి లా అండ్ ఆర్డర్ ? హోంమంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? హోంమంత్రి దీనిపై స్పందించాలి’’ అని చెప్పారు.

Also Read : Wifi Vs Hackers : వైఫై వాడుతున్నారా ? సేఫ్టీ టిప్స్ తప్పక తెలుసుకోండి