మన టాలీవుడ్ హీరోలు లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రపంచవేదికల మీద సత్తా చాటగా, తాజాగా అల్లు అర్జున్ కు ఆ అవకాశం వచ్చింది. ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కు మరో ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్‌లోని మైనపు బొమ్మల మధ్య స్థానం సంపాదించడం గొప్ప గౌరవం. ఈ ప్రతిష్టాత్మక మ్యూజియంలో దక్షిణ భారత ప్రముఖులకు పెద్దగా చోటుదక్కడం లేదనే చెప్పాలి. అయితే ఇటీవల దక్షిణాది సినిమా ప్రత్యేకించి తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ ప్రపంచ వేదికపై మన ప్రతిభను ప్రకాశింపజేయడానికి తలుపులు తెరిచింది.
టాలీవుడ్ నుండి ప్రభాస్, మహేష్ బాబు ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సాధించారు. చాలా రోజుల తర్వాత ఇక అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు కాబోతుండటం విశేషం. అల్లు అర్జున్ తన మైనపు విగ్రహం కోసం కొలతలు ఇవ్వడానికి లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌ను సందర్శించనున్నారు. ఇందుకోసం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రీకరణ నుండి విరామం తీసుకుంటున్నారు. లండన్‌కు బయలుదేరడం మరో రెండు రోజుల్లో షెడ్యూల్ చేయబడింది. విగ్రహం కోసం ఖచ్చితమైన కొలతలను ఇవ్వడానికి సమయం కేటాయించాడు. అల్లు అర్జున్ మైనపు విగ్రహ ఆవిష్కరణ వచ్చే ఏడాది జరగనుంది.
ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో తన అసాధారణ నటనకు జాతీయ అవార్డుతో సత్కరించడంతో అల్లు అర్జున్ స్థాయి గణనీయంగా పెరిగింది. ఈ గుర్తింపు మరింత పాపులారిటీ తీసుకొచ్చేలా చేసింది. పాన్ ఇండియా వ్యాప్తంగా అతిపెద్ద స్టార్‌లలో ఒకరిగా అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు. ఈ హీరో నటిస్తున్న ‘పుష్ప-2’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Also Read: Harish Rao: అనాథ విద్యార్థినికి హరీశ్ రావు అపన్నహస్తం, ఎంబీబీఎస్ స్టడీస్ కోసం ఆర్థిక సాయం