Manoj Sympathy: మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్ బాబు, విష్ణులపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మనోజ్‌కు అన్ని వర్గాల నుంచి సానుభూతి (Manoj Sympathy) పెరుగుతోంది. ఇప్పటికే మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో ఆయనపై వ్యతిరేకత వస్తోంది. మరోవైపు విష్ణు సైతం తన బౌన్సర్లతో మనోజ్, మీడియాలపై దాడికి యత్నించాడు. ఈ ఇష్యూలో మనోజ్‌కు సానుభూతి పెరుగుతున్నట్ల స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబుపై పలువురు నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి స్పందన
మోహన్ బాబు మీడియా ప్రతినిధి దాడి వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అనంతరం జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా మోహన్ బాబు వైఖరిని తప్పుబట్టారు.
Also Read: Suicide Attempt: మోహన్ బాబు ఇంటి పని మనిషి ఆత్మహత్యాయత్నం?
మీడియా ప్రతినిధిపై దాడిని ఖండిస్తున్నా: కేఏ పాల్
నటుడు మోహన్‌బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఎవరైనా సరే.. ఎంత పెద్దవారైనా మీడియాపై దాడి చేయడం అనేది సరికాదన్నారు. దాడి ఘటనపై వెంటనే మోహన్‌బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మంచు మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై చేసిన దాడిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌషిక్ యాదవ్ ఖండించారు. మీడియా ప్రతినిధి పై దాడి చేయడం సరి కాదని మండిపడ్డారు. తగాదాలు ఉంటే మంచు ఫ్యామిలీ ఇంట్లో కూర్చోని చర్చించుకోవాలన్నారు.
మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి సిగ్గు చేటు, అమానుషమని అన్నారు. అంతకుముందు తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారు.
మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా?
కుటుంబంలో జరుగుతున్న వివాదంలో మోహన్ బాబు ఆవేశపడి మీడియాపై దాడి చేయడం, తన కుమార్తె కోసం ఇంటికి వచ్చిన మంచు మనోజ్‌పై దాడి చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మోహన్ బాబు మీడియా ప్రతినిధి వద్ద మైక్ లాక్కుని చేసిన దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.