Kalatapaswi K Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినీ ప్రస్థానం ఇదే

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది.

  • Written By:
  • Updated On - February 3, 2023 / 10:15 AM IST

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది.

పురస్కారాలు ఇలా

విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 2016లో దాదాసాహెబ్‌ ఫాల్కేతో పాటు, ఇంకా ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

ఎన్నో సినిమాలు.. అన్నీ అద్భుతాలు

సుదీర్ఘ కెరీర్లో కె.విశ్వనాథ్ శంకరాభరణం, సాగరసంగమం, శృతి లయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు.

సౌండ్‌ రికార్డిస్టుగా ప్రారంభించి

చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్‌ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ఆరంభించిన కె.విశ్వనాథ్‌ (K.Viswanath) అంచెలంచెలుగా ఎదిగారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

50కిపైగా చిత్రాలు

కె.విశ్వనాథ్‌ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ప్రముఖుల సంతాపం

కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండితెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని కేసీఆర్‌ కొనియాడారు. భారతీయ సామాజిక, సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాల్లో పెద్దపీట వేశారన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కె.విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్‌ గారు కాలం చేయడం కలిచివేసింది. ఆయన కన్నుమూసిన వార్త విని నేను షాక్‌కు గురయ్యాను. ఆయనలాంటి డైరెక్టర్‌ కన్నుమూయడం నాకే కాదు సినీపరిశ్రమకే తీరని లోటు’’ అని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.