Site icon HashtagU Telugu

Kota Srinivasa Rao : చిరు తో సినీ ఎంట్రీ..పవన్ తో లాస్ట్ మూవీ

Kota Last Movie

Kota Last Movie

సినీ పరిశ్రమలో ఎనలేని ప్రతిభను కనబర్చిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు. ఆయన 1978లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి డెబ్యూట్ మూవీ ‘ప్రాణం ఖరీదు’ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి, తన ప్రత్యేకమైన నటనశైలితో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కోటా నటనకు భాష, పాత్ర పరిమితులు ఉండేవి కావు. ఒకేఏఅసెగా విలన్, కామెడీ, సీరియస్ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’లోనూ ఆయన ఓ కీలక పాత్రలో నటించినట్లు సమాచారం.

Trump Tarrif : అమెరికా టారిఫ్ లపై యూరోప్ ఆగ్రహం – ట్రేడ్ వార్ ముంచుకొస్తుందా?

కోటా శ్రీనివాసరావు మృతిపై టాలీవుడ్, పాలిటిక్స్ రంగాల నుంచి శోకసందేశాలు వెల్లువెత్తుతున్నాయి. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, “అనేక భాషల్లో నటించి మెప్పించిన గొప్ప నటుడు. ఆయన ఎమ్మెల్యేగా కూడా మంచి సేవలందించారు” అని కొనియాడారు. జూ. ఎన్టీఆర్ స్పందిస్తూ, “కోటా గారితో పనిచేసిన ప్రతి క్షణం చిరస్మరణీయం. ఆయన నటించిన పాత్రలు ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతాయి” అన్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “కోటా గారు ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసారు. ఆయన హాస్యాన్ని, తీవ్రమైన భావోద్వేగాలను మేళవించగలిగారు” అని తెలిపారు.

సినీ రంగంతో పాటు సామాజిక అంశాల్లోనూ కోటా గారు తమదైన ముద్ర వేశారు. మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, “కోటా గారు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచారు. వారి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు” అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, “సనాతన ధర్మం, భాషా పరిరక్షణ, సామాజిక విలువలపై యువతకు చైతన్యం కల్పించేందుకు కోటా శ్రీనివాసరావు చేసిన కృషి మరిచిపోలేం” అని గుర్తు చేశారు. ఆయన నటనతో పాటు ఆయన ప్రసంగాలు, బహిరంగ వేదికలపై ఆలోచనాత్మక అభిప్రాయాలు కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి.

పవన్ కళ్యాణ్ కూడా కోటా గారి మృతిపై స్పందించారు. “కోటా గారు నా తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’లోనే నటించారు. ఆ తర్వాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్లలో కలిసి పనిచేశాం. తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉండేది. ఓ పిసినారి, ఓ క్రూర విలన్, ఓ సాధారణ తండ్రి పాత్ర – ఏదైనా పాత్రలో ఆయన ఒదిగిపోయే విధానం అసాధారణం” అని ఆయన అన్నారు. ఈ మాటలు కోటా నటనకు నివాళిగా నిలుస్తాయి. కోటా శ్రీనివాసరావు మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగానే మిగిలిపోతాయి.