Film Chamber : తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు అంశం మరోసారి ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఒక అధికారిక లేఖ రాసింది. లేఖలో కార్మిక వేతనాల పెంపును పర్సంటేజ్ విధానంలో సూత్రీకరించడంతో పాటు, నాలుగు ముఖ్యమైన షరతులను స్పష్టంగా పేర్కొంది. ఫిల్మ్ ఛాంబర్ పంపిన లేఖ ప్రకారం, కొన్ని కీలక మార్గదర్శకాలను ఫెడరేషన్‌కు సూచించారు. వాటిలో ముఖ్యంగా కాల్‌షీట్ వ్యవస్థపై స్పష్టత ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే కాల్‌షీట్‌ను 12 గంటల రెగ్యులర్ పని సమయంగా పరిగణించాలని సూచించారు. ఇక కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సిన సందర్భాలు పరిమితమయ్యాయి. నెలలో రెండో ఆదివారం, అలాగే కార్మికశాఖ అధికారికంగా ప్రకటించే సెలవు దినాల్లో మాత్రమే డబుల్ పే వర్తించనుంది.
Read Also: Shubhanshu Shukla : స్వదేశానికి చేరుకున్న శుభాంశు శుక్లా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం, వీడియో వైరల్
ఇక, 2022 జూలైలో ఫెడరేషన్‌తో చేసిన ఒప్పందంలోని కీలక అంశాలు కూడా ఈ లేఖలో ప్రస్తావించబడ్డాయి. ప్రత్యేకంగా ఫైటర్స్, డాన్సర్స్ కోసం సూచించిన రేషియోలను 2023 సెప్టెంబరు నుంచి అమలులో పెట్టకపోవడాన్ని ఛాంబర్ తప్పుపట్టింది. వీటిని వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. అదే ఒప్పందంలోని జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం, నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా తమ చిత్రాల కోసం ఎంపిక చేసుకునే హక్కు నిర్మాతలకే ఉంటుందని ఛాంబర్ స్పష్టం చేసింది. ఈ షరతులను ఫెడరేషన్ అంగీకరిస్తే, వేతన పెంపుపై నిర్మాతలు ఓ వ్యూహాన్ని ప్రతిపాదించారు. రోజుకు రూ.2000కి తక్కువగా సంపాదించే కార్మికుల వేతనాలను తక్షణమే 10 శాతం పెంచేందుకు సన్నద్ధత ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి మరో 5 శాతం, ఆపై మరో ఏడాది తర్వాత మరోసారి 5 శాతం పెంపు కూడా వృద్ధి ప్రణాళికలో భాగంగా ఉంది.
కాగా, రూ.2000 నుండి రూ.5000 మధ్యలో వేతనం పొందుతున్న కార్మికులకు వరుసగా మూడేళ్లపాటు ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెంపు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం ఈ పెంపు వర్తించదని ఛాంబర్ స్పష్టం చేసింది. అలాంటి చిత్రాల విషయంలో ప్రస్తుత వేతనాలే కొనసాగుతాయని పేర్కొంది. ఇది చిన్న నిర్మాతలకు ఊరట కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే, మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన 24 కార్మిక సంఘాలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ పంపిన లేఖపై, అందులో పేర్కొన్న షరతులపై చర్చ జరగనుంది. వేతనాల పెంపు, పని పరిస్థితులపై ఉమ్మడి నిర్ణయానికి వస్తారా లేదా అన్నది పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఈ చర్చలతో కార్మికుల భవితవ్యంపై, సినిమా ఉత్పత్తి ఖర్చులపై ప్రభావం ఎంత పడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వేతనాల పెంపు నిజంగా ఆవశ్యకమా? లేక ఉత్పత్తి వ్యయాలపై అదనపు భారం మోపుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.