Fauzi: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి థియేట్రికల్ మూవీ ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన తాజా అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
మొదట ఈ చిత్రాన్ని 2026 ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే తాజా సమాచారం ప్రకారం విడుదల ప్రణాళికలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దసరా సీజన్ సినిమా వసూళ్లకు కలిసొచ్చే పెద్ద పండుగ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!
ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసేందుకు ప్రభాస్ తన డేట్స్ మొత్తాన్ని ‘ఫౌజీ’ చిత్రానికే కేటాయించినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యే వరకు ఆయన ఇతర ప్రాజెక్టులకు విరామం ఇచ్చి, దీనిపైనే పూర్తి దృష్టి సారించనున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ఔట్‌పుట్ పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉందని, విజువల్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించబోతోందని సమాచారం.
కథా నేపథ్యం- నటీనటులు
‘ఫౌజీ’ చిత్రం 1940ల నాటి నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. బ్రిటిష్ కాలంలోని సామాజిక-రాజకీయ ఉద్రిక్తతలు, మానవీయ భావోద్వేగాలను ఈ కథలో స్పృశించనున్నారు. హను రాఘవపూడి తనదైన శైలిలో యుద్ధం మరియు ప్రేమను ఈ చిత్రంలో మిళితం చేయనున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు దిగ్గజ నటీనటులు జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, చైత్ర జె ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ప్రభాస్ ఒక సైనికుడిగా సరికొత్త లుక్‌లో కనిపించనుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
