Fahadh Faasil : మలయాళ సినీ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నటుడు ఫహద్ ఫాసిల్, తాజాగా మాలీవుడ్ టైమ్స్ అనే చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా, ఆయన చేతిలో ఉన్న ఫోన్‌నే ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. ఈ ఈవెంట్‌లో ఫహద్ ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అయింది. అందరూ స్మార్ట్‌ఫోన్లతో తిరుగుతున్న ఈ యుగంలో, ఫహద్ మాత్రం తాను చాలా సాదా జీవితం గడుపుతున్నట్లు కనిపించడంతో నెటిజన్లు ఆయనను ‘మినిమలిజం’కి మోడల్‌గా అభివర్ణించారు.
వీడియో చూసిన వెంటనే అభిమానులు – “ఇంత పెద్ద నటుడైనా… చూడండి ఎంత సింపుల్‌గానో!” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను నింపేశారు. అయితే విషయం ఇక్కడితో ఆగలేదు. కొన్ని రోజులకు ఫహద్ ఉపయోగిస్తున్న ఫోన్ అసలు ధర బయట పడటంతో నెటిజన్లు మౌనమయ్యారు. అది ఏదో సాధారణ కీప్యాడ్ ఫోన్ కాదు, ఏకంగా విలాసవంతమైన అంతర్జాతీయ బ్రాండ్ వెర్టు కు చెందిన ఫోన్ అని తేలింది.
ఫహద్ చేతిలో ఉన్నది వెర్టు అసెంట్ – 4జీబీ – బ్లాక్ మోడల్, దీని ధర సుమారు $9,054 (దాదాపు రూ.10 లక్షలు). అంతేకాదు, ఫహద్ ఉపయోగిస్తున్న ఫోన్ వెర్టు అసెంట్ టి ఫెరారీ నీరో లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మోడల్ ప్రారంభ సమయంలోనే దాదాపు రూ.4 లక్షల విలువ కలిగి ఉండేది. ప్రస్తుతం ఈ ఫోన్‌లు ఈబే వంటి ప్లాట్‌ఫామ్స్‌లో రూ.10 లక్షలకు పైగా అమ్ముడవుతున్నాయి.
వెర్టు గురించి మాట్లాడాలంటే, ఇది 1998లో నోకియా ఆధ్వర్యంలో స్థాపించబడిన లగ్జరీ ఫోన్ బ్రాండ్. మొదట్లో యూకే కేంద్రంగా ఉండిన ఈ సంస్థ, ప్రస్తుతం హాంకాంగ్ , ఫ్రాన్స్‌కు చెందిన సంస్థల యాజమాన్యంలో ఉంది. వెర్టు ఫోన్‌లు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఫోన్‌లుగా పరిగణించబడతాయి. ఇవి మానవుల సామాజిక స్థితిని ప్రతిబింబించే సింబల్‌లుగా మారాయి.
ఇక ఫహద్ వ్యక్తిగత జీవనశైలి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు వినయ్ ఫోర్ట్ పంచుకున్న విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. “ఫహద్ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఆయన ఇప్పటికీ చిన్న కీప్యాడ్ ఫోన్‌నే వాడుతాడు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా లేదు. సోషల్ మీడియా నుంచి ఆయన దూరంగా ఉంటాడు” అని చెప్పారు.
ఫహద్ లైఫ్‌స్టైల్‌కి, ఆయన ఫోన్ ఎంపికకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాదా జీవన శైలి ఆవిష్కరణ అనుకునే విషయమే అసలు లగ్జరీగా ఉండటం, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.