సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో పర్సంటెంజీ విధానాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలకు కొద్దిరోజుల ముందు ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ యజమాని బాలగోవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. వారు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పర్సంటేజీ విధానం మీద నిర్మాతల వైఖరిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని, పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పర్సంటేజీ విధానం నడుస్తుంటే ఇక్కడ మాత్రం రెంటల్ విధానం సరికాదని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎగ్జిబిటర్లు థియేటర్లు మూసుకువనే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలకు ముందు ఈ సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు మాట్లాడటం లేదని మండిపడ్డారు.
‘పెద్ది’ చిత్రం నుంచి తమకు కచ్చితంగా పర్సంటేజీ విధానం అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఓటీటీల వల్ల థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పడిపోతోందని గుర్తు చేశారు. ఒకప్పుడు థియేటర్ల ద్వారా మంచి ఆదాయం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 120 మంది ఎగ్జిబిటర్లు దీనావస్థలో ఉన్నారని వాపోయారు. చిత్ర నిర్మాతలకు థియేటర్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ ఇలా వివిధ మార్గాల్లో ఆదాయం వస్తోందని, ఎగ్జిబిటర్లకు మాత్రం లాభం లేకుండా పోయిందని అన్నారు. పైగా థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని అన్నారు. పర్సంటేజీ విధానం ఇస్తేనే తమ థియేటర్లలో సినిమాలను ఆడిస్తామని స్పష్టం చేశారు.
