Site icon HashtagU Telugu

Puri and Charmi: ఈడీ ముందుకు పూరి, చార్మి.. ‘లైగర్’ లావాదేవీలపై ఆరా!

Puri And Charmi

Puri And Charmi

హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను అధికారులు ప్రశ్నించారు. లైగర్ మూవీ లావాదేవీలకు సంబంధించి వీరిని అధికారులు ప్రశ్నిస్తుండగా.. పలు సంస్థల నుంచి పూరి, చార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధులపై నిన్న ఉదయం నుంచి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 15 రోజుల క్రితమే వీరిద్దరికీ ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. లైగర్‌ సినిమాలో ఎమ్మెల్సీకల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారని, ఆమెకు చెందిన సొమ్ము పెద్ద మొత్తంలో విదేశాల నుంచి లైగర్‌ నిర్మాతలకు అందిందని కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈడీ పూరీ, చార్మీలకు నోటీసులు ఇచ్చి గురువారం విచారణకు పిలిచింది.

విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ విచారిస్తోంది. వారిద్దరూ అవసరమైన పత్రాలు వెంట తీసుకుని గురువారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 10 గంటలకు పైగా వారిద్దర్నీ వేర్వేరుగా ఈడీ అధికారులు విచారించారు. లైగర్‌ చిత్రంలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? నిధుల సమీకరణ ఎలా జరిగింది? చిత్ర నిర్మాణం ఖర్చులు, వచ్చిన ఆదాయం,పంపకాలకు సంబంధించి ఆరా తీసినట్లు తెలిసింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు.