Tollywood Drugs Case : మ‌రో ట‌ర్న్ తీసుకున్న‌.. టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు..!

  • Written By:
  • Updated On - March 24, 2022 / 11:17 AM IST

తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసు, తాజాగా మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వట్లేదంటూ సీఎస్ సోమేశ్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలో కోర్టు ధిక్కరణ కింద సోమేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌ను శిక్షించడంతో పాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోరింది.

ఇక సోమేశ్ కుమార్, సర్పరాజ్ అహ్మద్‌కు ఈ నెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపామని, త్వరలోనే ఈ పిటిషన్ పై విచారణ జరగుతుందని ఈడీ పేర్కొంది. ఈ క్ర‌మంలో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలను ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి కానీ, ఎక్సైజ్ శాఖ నుంచి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పందన రాలేదు.

ఈ నేప‌ధ్యంలో హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ డేటాను ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక‌పోతే 2017లో వెలుగులోకి చూసిన టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ ప్రశ్నించిన సంగ‌తి తెల‌సిందే. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎక్సైజ్ శాఖ 12 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. అయితే కేసును సీబీఐ, ఈడీ, ఎన్​సీబీ, డీఆర్ఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా టాలీవుడ్ డ్ర‌గ్స్ ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.