వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘టైటానిక్’. ఈ మూవీలో లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio), కేట్ విన్‌స్లెట్ (Kate Winslet) హీరోహీరోయిన్లుగా నటించారు. ‘రోజ్’ పాత్రలో కేట్ విన్‌స్లెట్ అందాన్ని చూసి ప్రపంచంలోని ప్రతి ఒక్కరు మైమరచిపోయారు. కాగా ఈ పాత్రతో కేట్ విన్‌స్లెట్ ఆస్కార్ నామినేషన్స్ లో స్థానం దక్కించుకున్నారు.
కానీ ఆస్కార్ ని మాత్రం అందుకోలేక పోయారు. అయితే 2009లో వచ్చిన ‘ది రీడర్’ అనే సినిమాతో బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ ని అందుకున్నారు. ఆస్కార్ అనే దానిని ప్రతి ఒక్కరు ఎంతో గర్వంగా భావిస్తారు. ఆ అవార్డు అందితే నెత్తిమీద పెట్టుకుంటారు. కానీ కేట్ విన్‌స్లెట్ మాత్రం ఆ ఆస్కార్ ని బాత్‌రూమ్ లో పెట్టిందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసి అందరికి షాక్ ఇచ్చారు. అలా బాత్‌రూమ్ లో పెట్టడానికి గల కారణం కూడా చెప్పారు.
“జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ ని పట్టుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అది అందరికి సాధ్యం కాదు. అందుకనే నా ఇంటికి వచ్చే అతిథులకు నేను ఆ అవకాశం కల్పిస్తూ.. నా ఆస్కార్ ని బాత్‌రూమ్ లో పెట్టాను. బాత్‌రూమ్ కి వెళ్లిన తరువాత ఫ్లష్ చేసి బయటకి వచ్చే ముందు ప్రతిఒక్కరు ఒక ఐదు నిముషాలు అక్కడ అద్దం ముందు నిలబడతారు. ఆ సమయంలో వారికీ నేను ఆస్కార్ పట్టుకునే అవకాశం కల్పిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
అలా ఆస్కార్ ని పట్టుకొని బయటకి వచ్చిన ఆ అతిథుల మొఖాల్లో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఆమె నిర్ణయం కొందరికి నచ్చినా, కొందరికి మాత్రం ఆగ్రహం తెప్పించింది. ఆస్కార్ వంటి అవార్డుని బాత్‌రూమ్ లో పెట్టడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కేట్ విన్‌స్లెట్ ఆస్కార్ నామినేషన్స్ లో మొత్తం ఏడుసార్లు స్థానం దక్కించుకుంటే.. ఒక్కసారి అవార్డుని అందుకున్నారు.