టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ చివరగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. మూవీ బాగుందని టాక్ వచ్చినా సరే కలెక్షన్స్ లు మాత్రం అనుకున్న విధంగా రాలేదు. కనీసం ఒపెన్సింగ్స్ రాబట్టలేకపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్.
రాజావారు రాణివారు ఫేం రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పనులు సైలెంట్ గా ప్రారంభం అయ్యాయి. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఒక ఈవెంట్ పెట్టి టైటిల్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారట. కానీ ఈ లోపే దిల్ రాజు సినిమా టైటిల్ ని ప్రకటించి మేకర్స్ కి షాక్ ఇచ్చాడు. కాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్ సందర్భంగా బుధవారం నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాల అప్‌డేట్స్ గురించి చెబుతూ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ చిత్రానికి రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అయితే ఈ టైటిల్ ని ఇంతవరకు ప్రకటించలేదనే విషయం దిల్ రాజు మర్చిపోయారు. మీడియా ప్రతినిధి ఆ విషయాన్ని గుర్తు చేయడంతో దిల్ రాజుతో పాటు మిగతా వాళ్లు కూడా ఘొల్లున నవ్వేశారు. మరి విజయ్ సినిమాకు ఇదే టైటిల్ ని ఖరారు చేస్తారా లేదంటే వేరే టైటిల్ ని పెడతారో అన్నది చూడాలి మరి.