Site icon HashtagU Telugu

Rajamouli Dream: రాజమౌళి కల నెరవేరేనా?

Rajamouli

Rajamouli

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మార్మోగుతోంది. మెగా హీరో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడం, రాజమౌళి దర్శకత్వం వహించడం ఇందుకు ప్రధాన కారణం. విడుదలైన అన్ని రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తన మార్క్ డైరెక్షన్ తో రాజమౌళి మరోసారి టాలీవుడ్ పేరును విశ్వవ్యాప్తం చేశాడు. ఈ నేపథ్యంలో రాజమౌళికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి చర్చనీయాంశంగా మారింది.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఓ సందర్భంలో సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ తో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ఓ ఇంటర్వూలో ‘మీరు తమిళ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రం చేస్తే ఎవరితో చేస్తారు’? అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా రాజమౌళి… ‘‘కమల్ విలన్‌గా, రజినీకాంత్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉందీ, ఒకవేళ రజని విలన్‌గా, కమల్ హీరోగా ఉన్నా పరవాలేదు. ఇది చాలా సార్లు నా మైండ్‌లో మెదులుతుంటుంది. పూర్తి కథ లేదు కానీ అలా వారిద్దరిని చూడాలని ఓ అభిమానిగా వారితో అలాంటి సినిమా  చేయాలనుంది’’ అని అన్నాడు జక్కన్న.

అయితే ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు అంతేస్థాయిలో రాజమౌళి పేరు మార్మోగుతోంది. ఇప్పటికే ఆయన ఈగ, మగధీర, బాహూబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు తీసి తెలుగు తెరపై ముద్ర వేసిన రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతో మంది స్టార్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్ లు  రాజమౌళితో ఎన్ని సినిమాలు చేయడానికైనా, ఎంత సమయం ఇవ్వడానికైనా వెనుకాడటం లేదంటే జక్కన్న కెపాసిటి ఎంటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే టాలీవుడ్ హీరోలు మొదలుకొని.. బాలీవుడ్ హీరోల దాకా రాజమౌళి సినిమా చేయడానికి సై అంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్, రజనీకి తగ్గ కథను సిద్దం చేస్తే.. జక్కన కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పక తప్పదు.

Exit mobile version