Deepika Padukone: హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ తన తదుపరి చిత్రం ముంబైలో జరగనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సూచించారు. “గ్జాండర్ తదుపరి సాహసం ముంబైలో” అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆయన 2017లో వచ్చిన ‘xXx: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రంలో కలిసి నటించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో మళ్లీ కలిసి పనిచేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
దీపికా షెడ్యూల్లో మార్పులు
ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ దీపికా పదుకొణె ఇటీవల ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె షెడ్యూల్ ఖాళీగా ఉంది. ఈ పరిణామం ఆమె అభిమానులలో చర్చకు దారితీసింది. దీపికా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ‘కల్కి’ నుంచి తప్పుకున్నారేమో అని అభిమానులు ఊహిస్తున్నారు. ‘xXx’ చిత్రంలో దీపికా.. డీజిల్ పాత్రకు సహాయం చేసే “సెరీనా ఉంగర్” పాత్రలో నటించారు.
Also Read: Royal Enfield Bullet: రూ. 1.62 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్!
విన్ డీజిల్ పోస్ట్ సారాంశం
విన్ డీజిల్ తన పోస్ట్‌లో అనేక ప్రాజెక్ట్‌లను ప్రస్తావించారు. “చాలా విషయాలు పంచుకోవాలి.. లోతైన భావోద్వేగాలను కలిగించే ఐకానిక్ కథలు.. గ్జాండర్ తదుపరి సాహసం ముంబైలో” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లపై అభిమానులలో ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ చిత్రంలో దీపికా నటిస్తున్నారని ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
దీపికా తన తదుపరి ప్రాజెక్ట్ కింగ్ మూవీలో షారుఖ్ ఖాన్, ఆయన కూతురు సుహానా ఖాన్‌లతో కలిసి నటిస్తున్నారు. కల్కి 2898 ADతో పాటు ఆమె సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి కూడా తప్పుకున్నారు. అందుకు గల కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో విన్ డీజిల్ ప్రాజెక్ట్ కోసం ఆమె తప్పుకున్నారా అనేది అధికారికంగా తేలాల్సి ఉంది.