Padma Vibhushan Award తన పాత్రకు న్యాయం చేయాలనే తప్ప ఎన్నడూ అవార్డుల గురించి ఆలోచించని గొప్ప నటుడు ధర్మేంద్ర.. అంటూ ఆయన భార్య, నటి, ఎంపీ హేమామాలిని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిని స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
- తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉందన్న హేమామాలిని
- కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నటి
- సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు
పద్మవిభూషణ్ అవార్డు ప్రకటనతో సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఇప్పుడు ధర్మేంద్ర గురించి, ఆయన చేసిన మంచిపనుల గురించి మాట్లాడుకుంటున్నారని హేమామాలిని చెప్పారు. ఆ మాటలు వింటుంటే తమ హృదయాలు ఆనందం, గర్వంతో నిండిపోతున్నాయని చెప్పారు. ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పనిచేయలేదని, తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలని నిరంతరం శ్రమించారని తెలిపారు. జీవిత సాఫల్య పురస్కారం తప్ప ధర్మేంద్రకు ఒక్క ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా రాలేదని హేమామాలిని గుర్తు చేశారు.
