Site icon HashtagU Telugu

Dhanush VS Heroine Nayanatara : మీరు మారండి ..అంటూ ధనుష్ ను ఉద్దేశించి విఘ్నేశ్ ట్వీట్..

Dhanush Nayan

Dhanush Nayan

నయనతార, హీరో ధనుష్ మధ్య వివాదం (Controversy between Nayanthara and hero Dhanush) ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. నయనతార తన జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. ‘నయనతార- బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీలో ఇండస్ట్రీలో తన ప్రయాణం, విఘ్నేశ్ శివన్ తో తన ప్రేమ, పెళ్లి తదితర వివరాలన్నీ చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తామిద్దరి పరిచయం, ప్రేమకు దారితీసిన సినిమా ‘నానుం రౌడీ ధాన్’ లో ఓ చిన్న సన్నివేశాన్ని తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకుంది.

సినిమాలో నుంచి చిన్న క్లిప్ ను వాడుకోవడానికి ఆ సినిమాను నిర్మించిన ధనుష్ అనుమతి కోసం చాలా ప్రయత్నించింది. అయితే, ధనుష్ మాత్రం ఎటూ తేల్చకుండా, నయనతారకు ఎలాంటి జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. తీరా ఇటీవల నయనతార తన డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశాక ధనుష్ రూ.10 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపాడు. దీంతో ధనుష్ పై నయన్ ఏకంగా మూడు పేజీల లేఖ రాస్తూ పలు విమర్శలు చేసింది.

ఈ లేఖలో ధనుష్ క్యారెక్టర్ ని తప్పు బడుతూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది. ‘తండ్రి, దర్శకుడైన సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని రూపొందించాం. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులోభాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. నా సినీప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైంది. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరమని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం పై ధనుష్ స్పందించకపోయిన..ఇండస్ట్రీలోని పలువురు హీరోయిన్లు , ప్రముఖులు నయన్ కు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో నయన్ భర్త , డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ కూడా ధనుష్​ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆయన పోస్ట్​ చేసిన కొద్ది సేపటికీ ఇది ఇంటర్నెట్​లో వైరలైంది. అయితే విఘ్నేశ్ ఈ పోస్ట్​ను కాసేపటి తర్వాత తొలగించారు.

విఘ్నేశ్ పోస్టులో ..’ద్వేషాన్ని కాదు, ప్రేమను పంచండి. మీ కోసం పడి చచ్చిపోయే అమాయక అభిమానుల కోసమైనా మీరు మారండి. మనుషులు మారాలని, ఎదుటివారి ఆనందాల్లో కూడా సంతోషం వెతుక్కోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని విఘ్నేశ్ ఆ పోస్ట్​లో రాసుకొచ్చారు. కానీ, ఆయన దీనిని తొలగించడం గమనార్హం. అలాగే ఈ పోస్టు ఎందుకు డిలీట్‌ చేశారో కూడా తెలియదు.

Read Also : Rama Murthy Naidu Funeral : తమ్ముడి పాడె మోస్తూ చంద్రబాబు కన్నీరు