Dhandoraa Teaser : కట్టిపడేసిన ‘దండోరా’ టీజర్

Dhandoraa Teaser : శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన తారాగణంగా రూపొందిన దండోరా మూవీ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Dandora Easer

Dandora Easer

శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన తారాగణంగా రూపొందిన దండోరా మూవీ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకున్న దర్శకుడు మురళీ కాంత్, సమాజంలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్ష, ఆర్థిక అసమానతల్ని వాస్తవాలకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. ఓ పల్లెటూరులో జరిగే చిన్న దైనందిక సంఘటనల నుంచి పెద్ద సామాజిక సమస్యల దాకా కథనం విస్తరించబోతుందనే సంకేతాలు టీజర్‌లో కనిపిస్తున్నాయి. నటుల పాత్రల పరిచయం, అవతారాలు, డైలాగ్‌లు ఇలా అన్ని కలిసి ప్రేక్షకుల్లో గ్రామీణ వాతావరణం, స్థానిక సమస్యలపై ఒక నిజమైన భావాన్ని కలిగిస్తున్నాయి.

Golden Passport: గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలు ఏంటి?!

టీజర్‌లో లవ్ స్టోరీతో మొదలైన కథనం క్రమంగా కులవివక్ష, సామాజిక ఒత్తిళ్ల వాస్తవాలను బయటపెడుతుంది. నవదీప్ చెబుతున్న “మేం తంతే లేవనోళ్లు… అయినొచ్చి గోకితే లేస్తరాని ఎందివయా ఇది?” వంటి డైలాగ్‌లు, తెలంగాణ ఉచ్చారణకు దగ్గరగా ఉండి పల్లెటూరి సామాన్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గ్రామ సర్పంచ్‌గా నవదీప్ ప్రదర్శనలో ఉన్న వ్యంగ్య హావభావాలు కథలోకి కామెడీ టచ్ తీసుకువస్తాయి. అదే సమయంలో, కులవ్యవస్థ ఎంతవరకు మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తుందో చూపించేలా శవాన్ని ఊరి చివర్లోనే దహనం చేయాలన్న రూల్స్, దాని వల్ల వచ్చే హృదయ విదారక సన్నివేశాలు టీజర్ చివర్లో ప్రేక్షకుడిని కదిలిస్తాయి. ఈ క్రమంలోనే ఒక ప్రేమజంటపై అగ్రవర్ణాల అణచివేత ఎలా మోపబడుతుందన్న అంశాన్ని కూడా సినిమాలో చర్చించినట్టు కనిపిస్తోంది.

ఈ కథలో అత్యంత ఆకర్షణీయమైన పాత్ర బిందు మాధవి పోషించిన శ్రీలతది. వేశ్యగా కనిపించే ఆమె పాత్రలోని కఠోరత, బాధ, జీవన వాస్తవాలు అన్నీ ఒక్క డైలాగ్‌లో ప్రతిఫలిస్తాయి.“వాళ్లు డబ్బులిస్తున్నారు… నేను వాళ్లకు సర్వీస్ చేస్తున్నా.” ఆమె పాత్ర ద్వారా సమాజం ద్వంద్వ స్వభావం, మగాధిపత్య దోపిడీ, బతుకుదెరువు కోసం సాధారణ మహిళలు పడే కష్టాలు గట్టిగా బయటపడుతున్నాయి. ఈ కథను పల్లెటూరి హాస్యం, వెటకారం, భావోద్వేగాలతో కలిపి చూపించబోతుండటంతో దండోరా ఒక కంటెంట్-డ్రివ్‌ మూవీగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కలర్ ఫోటో, బెదురులంక 2021 వంటి కథా బలమున్న సినిమాలు ఇచ్చిన లౌక్య ఎంటర్టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం మరో హైలైట్. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే అంచనాలను పెంచేసింది.