Site icon HashtagU Telugu

Mohan Babu Attack : మోహన్ బాబు ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

Mohanbabu Arrest

Mohanbabu Arrest

సీనీ నటుడు మోహన్ బాబు (Mohan Babu ) మీడియాపై చేసిన దాడి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. జలపల్లిలోని తన ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనలో, అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి చేయడం సిగ్గుచేటని, అమానుషమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రతినిధిపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, మైక్ లాక్కుని దాడి చేయడం పై యావత్ మీడియా తో పాటు రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. మోహన్ బాబు పై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మోహన్ బాబు రౌడీషీటర్లా ప్రవర్తించి, తమ స్వేచ్ఛకు భంగం కలిగించారని వారు మండిపడ్డారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ వేదికగా మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. “మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంబం. ఈ స్థంబంపై దాడి చేయడం చాలా ప్రమాదకరం. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు సైతం ఈ ఘటన పై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, మోహన్ బాబు ప్రవర్తన మానసిక అనారోగ్యానికి నిదర్శనమని విమర్శించారు.

మీడియా ఆగ్రహం :

సినీనటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు టి.వి9 రిపోర్టర్ రంజిత్, మరో వీడియో జర్నలిస్టు సూర్యం పై మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాము. తన కుటుంబంలో తెలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో మీడియా కవరేజ్ కి వెళ్ళగా జర్నలిస్టులపై మోహన్ బాబు భౌతిక దాడులకు దిగడం ఎంత మాత్రం సమంజసం కాదు. తన ప్రతాపాన్ని మీడియా పై చూపడం దారుణం. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, తెలంగాణఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్ లు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనియన్ తరపున ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దాకా పోరాడుతామని హెచ్చరించారు.

Read Also : Mohan Babu Attack : మీడియా పై మోహన్ బాబు దాడి..చూస్తూ ఉండిపోయిన పోలీసులు