Chiranjeevi’s Royal Gift Range Rover to Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కేవలం అభిమానులనే కాకుండా, సామాన్య ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. మెగాస్టార్ మార్కు మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం అంచనాలను మించి విజయం సాధించింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలవడమే కాకుండా, ఆయనలోని అసలైన వింటేజ్ నటుడిని మళ్ళీ వెండితెరపై ఆవిష్కరించిందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
ఈ బ్లాక్ బస్టర్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని వినూత్నంగా చాటుకున్నారు. చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి అత్యంత ఖరీదైన ‘రేంజ్ రోవర్ స్పోర్ట్స్’ (Range Rover Sports) కారును కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు కోట్ల విలువ చేసే ఈ కారును స్వయంగా అనిల్‌కు అందజేసి తన కృతజ్ఞతను తెలిపారు. కేవలం హిట్ ఇవ్వడమే కాకుండా, తనను ఒక కొత్త కోణంలో చూపించినందుకు అనిల్ పట్ల చిరంజీవి ఎంతో ముగ్ధులయ్యారు. గతంలో అనిల్ పుట్టినరోజు సందర్భంగా కూడా చిరు ఒక విలువైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే, ఇప్పుడు ఈ కారు గిఫ్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
Anil Renj
వసూళ్ల పరంగా చూస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఈ ఏడాది సంక్రాంతి రేసులో నిలిచిన సినిమాల్లో ఇది ‘క్లీన్ విన్నర్’గా అవతరించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఒక వైపు సినిమా విజయంతో చిత్ర బృందం ఫుల్ జోష్‌లో ఉండగా, మరోవైపు చిరంజీవి తన దర్శకుడికి ఇచ్చిన ఈ ‘మెగా రేంజ్’ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
