Site icon HashtagU Telugu

Shyam Benegal : శ్యామ్ బెనెగల్ మృతి పట్ల చిరంజీవి దిగ్బ్రాంతి

Chiru Shyam Benegal

Chiru Shyam Benegal

ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్(Shyam Benegal) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా శ్యామ్ బెనెగల్ కు సంతాపం తెలియజేసారు. ” మన దేశంలోని అత్యుత్తమ చలనచిత్ర నిర్మాతలు మరియు గొప్ప మేధావులలో ఒకరైన శ్రీ శ్యామ్ బెనెగల్ మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన భారతదేశంలోనే ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించాడు. కొన్ని ప్రకాశంవంతమైన సినిమాలను అందించాడు. అతని సినిమాలు, జీవిత చరిత్రలు మరియు డాక్యుమెంటరీలు భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమయ్యాయి. తోటి హైదరాబాదీ,మాజీ రాజ్యసభ సభ్యుడు.. బెనెగల్ సాబ్ యొక్క అద్భుత రచనలు భారతీయ చలనచిత్రంలో ఎల్లప్పుడూ గొప్ప గౌరవాన్ని పొందుతాయి.. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్” అంటూ రాసుకొచ్చారు.

శ్యామ్ బెనెగల్(Shyam Benegal)(90) కిడ్నీ సంబంధిత సమస్యలతో సోమవారం (డిసెంబర్ 23వ తేదీ) సాయంత్రం మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె పియా బెనెగళ్ ధ్రువీకరించారు. గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. 1934లో హైద‌రాబాద్ స్టేట్‌లోని తిరుమ‌ల‌గిరిలో శ్యామ్ బెన‌గ‌ల్ జ‌న్మించారు. సికింద్రాబాద్ ప్ర‌భుత్వ కాలేజీలో డిగ్రీ చదివి, ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ ఎక‌నామిక్స్ ప‌ట్టా పొందారు. శ్యామ్ బెనెగల్ పేరు చెప్పగానే నవతరంగ సినీ ఉద్యమం గుర్తుకు వస్తుంది. ఆయన “అంకూర్,” “నిషాంత్,” “మంతన్,” “బూమిక” వంటి విజయవంతమైన చిత్రాలతో భారతీయ సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే కథలను అందించారు. సమాజంలో ఉన్న విభిన్న సమస్యలను సినీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేసే పనిలో ఆయన ముందుండేవారు. ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు. శ్యామ్ బెనెగల్ మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని నష్టం. ఆయన లేని లోటు పూడ్చడం అసాధ్యం. సినీ రంగంలోని ప్రముఖులు, అభిమానులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Read Also : Police Notice : విచారణకు రావాలంటూ అల్లు అర్జున్ కు పోలీసుల నోటీసులు