Jagadeka Veerudu Athiloka Sundari : ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి ముందు అనుకున్న కథ వేరు.. చిరంజీవి మార్చేశారు..

'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి ముందు అనుకున్న కథ వేరు. ఆ కథలో చిరంజీవి చేసిన మార్పులు సినిమాకి విజయానికి..

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 05:15 PM IST

Jagadeka Veerudu Athiloka Sundari : చిరంజీవి, శ్రీదేవి హీరోహీరోయిన్స్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సోషియో ఫాంటసీ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. అశ్వినీదత్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం.. 1990 మే 9న రిలీజ్ అయ్యి వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే కాదు టాలీవుడ్ లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. దేవ కన్య భూమి పైకి విహారానికి రావడం, దేవలోకానికి తిరిగి వెళ్లలేక ఇక్కడ హీరోతో ట్రావెల్ అవ్వడం.. వంటి అద్భుతమైన పాయింట్ తో ఈ సినిమా కథని యండమూరి వీరేంద్రనాథ్ రచించారు.

అయితే ఈ మూవీకి మొదటి అనుకున్న కథకి, ఫైనల్ గా స్క్రీన్ పై చూసిన కథకి కొంచెం డిఫరెన్స్ ఉంది. 1957లో రష్యా ‘లైకా’ (Laika) అనే కుక్కపిల్లని రాకెట్‌లో (Sputnik2) అంతరిక్షంకి పంపించిన విషయం అందరికి తెలిసిందే. దాని ఆధారంగా చేసుకునే జగదేకవీరుడు అతిలోకసుందరి కథని మొదటిగా రాసుకున్నారు. ఆ కథ ఏంటంటే.. చంద్రమండలానికి రాకెట్‌లో మనిషిని పంపాలని ఇస్రో ఒక ప్రయోగం తలపెడుతుంది. అందుకోసం ఒక వాలంటీర్ కావాలంటూ ఇస్రో యాడ్ ఇస్తుంది. ఆ యాడ్ ని హీరో చూస్తాడు.

హీరో దగ్గర పెరుగుతున్న ఓ అనాథ పాపకి చికిత్స చేయించడం కోసం చాలా డబ్బు అవసరం అవుతుంది. దీంతో ఆ డబ్బు కోసం హీరో ఇస్రో అధికారులను కలుస్తాడు. తాను చంద్రమండలానికి వెళ్తానని, అందుకోసం పాప ప్రాణాలు కాపాడాలంటూ కోరతాడు. దానికి ఇస్రో అధికారులు ఒప్పుకోవడంతో.. చిరంజీవి చంద్రమండలానికి బయలుదేరుతాడు. ఇక ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ కూడా పౌర్ణమి రోజున విహార యాత్ర కోసం చంద్రమండలానికి వస్తుంది.

అక్కడ నుంచి మిగతా కథంతా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చూసిందే. అయితే ఈ కథ విన్న చిరంజీవి.. “రాకెట్ ప్రయోగం, చంద్రమండలం ఇవన్నీ ఎందుకు. మన పురాణాల్లో దేవకన్యలు, దేవతలు భూమి పై ఉన్న మానస సరోవరానికి విహారానికి వచ్చే వారని ఉంది. అలా ఏదైనా ట్రై చేయండి” అంటూ సలహా ఇచ్చారు. అలా చిరంజీవి ఇచ్చిన సలహాతో ఫైనల్ స్క్రిప్ట్ ని రెడీ చేసారు.