Charlie Chaplin Birthday Today : మాట్లాడకుండా ..పొట్టచెక్కలు చేస్తాడు

చాలామంది వారి మాటలతో నువ్వుల్లో ముంచేస్తే..చార్లీ చాప్లిన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొట్ట చెక్కలు చేయడం ఈయన ప్రత్యేకత

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 09:48 AM IST

చార్లీ చాప్లిన్ (Charlie Chaplin)..ఈ పేరు చెప్పగానే తెలియకుండానే నవ్వుతుంటాం. చాలామంది వారి మాటలతో నువ్వుల్లో ముంచేస్తే..చార్లీ చాప్లిన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొట్ట చెక్కలు చేయడం ఈయన ప్రత్యేకత. అలాంటి గొప్ప కమెడియన్ పుట్టిన రోజు ఈరోజు. 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లో చార్లీ చాప్లిన్ జన్మించాడు. అతని తల్లి పేరు హన్నా ఆమె శ్పానిష్-ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి- వంశీయుడు. తల్లిదండ్రులు ఇద్దరు వృత్తిరీత్యా నటులు అవ్వడంతో ..చార్లీ చిన్నప్పటి నుండే హాస్యం పండించడం నేర్చుకున్నాడు. కానీ తండ్రి తాగుబోతు అవ్వడం వల్ల సంపాదించిన డబ్బును తాగుడుకే తగిలేసేవాడు. దీంతో చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లికి కూడా మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు.

చార్లీ నటుడిగా రంగ ప్రవేశం :

చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. 5 వ ఏటా ఫస్ట్ టైం తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. ఆ తర్వాత నాటకాలు వేసేందుకు ట్రై చేసాడు కానీ వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి జీవనం కొనసాగించాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి “From Rags to Riches ” అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు. ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వుల్లో ముంచిన ఈయన..1977 డిసెంబర్ 25న స్విట్జర్లాండ్లో మరణించారు.

చార్లీ చాప్లిన్ మరణం తర్వాత 1978లో శ్మశానం నుంచి చార్లీ చాప్లిన్ శవపేటికను ఇద్దరు దొంగలు తవ్వి ఎత్తుకెళ్లారు. ఆ శవ పేటిక ఇవ్వాలంటే 4 లక్షల పౌండ్లు (సుమారు 24 లక్షల డాలర్లు) చెల్లించాలని, డబ్బు ఇవ్వకపోతే పిల్లలకు హాని చేస్తామని చాప్లిన్ నాలుగో భార్య ఊనాను బెదిరించారు. ఆ విషయాన్ని ఆమె రివీల్ చేయకపోయినా.. బయటికి లీకైంది. 5వారాలకు కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

చాప్లిన్‍ వివాహాలు – పిల్లలు :- చాప్లిన్‍ ఒకరిద్దరిని కాదు నలుగుర్ని వివాహం ఆడాడు. మొదటి భార్య మెల్డెర్డ్ హారిస్ (1918 – 1921), రెండో భర్య లిటా గ్రే (1924 – 1927), మూడో భార్య పాలెట్టె గొడ్డార్డ్ (1936 – 1942), నాల్గో భార్య ఊనా ఓ’నెయిల్ (1943 – 1977). వీరికి మొత్తం 11 మంది పిల్లలు పుట్టారు. చార్లెస్ చాప్లిన్ జూనియర్, సిడ్నీ చాప్లిన్ (అమెరికన్ నటుడు), జెరాల్డిన్ చాప్లిన్, మైఖేల్ చాప్లిన్ (నటుడు), జోసెఫిన్ చాప్లిన్, ఉజీన్ చాప్లిన్, క్రిస్టోఫర్ చాప్లిన్ లతో కలసి మొత్తం 11 మంది.