- ఛాంపియన్ ట్రైలర్ విడుదల
- ఛాంపియన్ ట్రైలర్ వేడుకలో రామ్ చరణ్
- ఆసక్తి రేపుతున్న ఛాంపియన్ ట్రైలర్
Champion : శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కథానాయకుడిగా, వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ‘ఛాంపియన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ట్రైలర్ బట్టి చూస్తే ఈ మూవీ కథ ఎలా ఉండబోతుందో అర్ధం అవుతుంది. ‘ఛాంపియన్’ కేవలం ఒక క్రీడా నేపథ్య చిత్రం మాత్రమే కాదు, దీని వెనుక బలమైన తెలంగాణ చరిత్ర ఉంది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తెలంగాణ ప్రాంతంలోని ‘భైరాన్‌పల్లి’ వంటి గ్రామాలు ఇంకా రజాకార్ల అణచివేతలోనే ఉన్న కాలఘట్టాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఎంచుకున్నారు. ఫుట్‌బాల్ ఆడి విదేశాలకు వెళ్లాలనే కలలు కనే ఒక సామాన్య యువకుడు, తన ఊరిలో జరుగుతున్న అరాచకాలను చూసి ఎలా తిరగబడ్డాడు అనేది ఈ సినిమా ప్రధానాంశం. మైదానంలో పరుగెత్తాల్సిన కుర్రాడు, తన జాతి అస్తిత్వం కోసం యుద్ధభూమిలోకి అడుగుపెట్టే క్రమాన్ని ట్రైలర్‌లో చాలా ఇంటెన్స్‌గా చూపించారు.
వైజయంతీ మూవీస్ తమ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతోంది. 1940ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన ఆర్ట్ వర్క్, ఆ కాలపు ఇళ్లను మరియు రజాకార్ల అరాచకాలను కళ్లకు కట్టేలా చూపించిన కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ చారిత్రక యాక్షన్ డ్రామాకు మరింత గంభీరతను చేకూర్చింది. ముఖ్యంగా రోషన్ మేక తన రెండో సినిమాకే ఇటువంటి భావోద్వేగపూరితమైన పాత్రను ఎంచుకోవడం, అందులో అతను చూపించిన పరిణతి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఇన్నేళ్ల తర్వాత నందమూరి కళ్యాణ చక్రవర్తి రీ-ఎంట్రీ ఇవ్వడం కూడా సినిమాపై అంచనాలను పెంచింది. ‘పెళ్లి సందడి’ వంటి కమర్షియల్ ఎంట్రీ తర్వాత రోషన్ తీసుకున్న సుదీర్ఘ విరామం వృథా కాలేదని ఈ ట్రైలర్ నిరూపిస్తోంది. ఒక సాధారణ హీరోగా కాకుండా, ఒక నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ఈ ‘ఛాంపియన్’ సినిమాతో అతనికి లభించింది. కథలో దాగిన ఉద్వేగం, తెలంగాణ ప్రజల పోరాట పటిమ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే రోషన్ టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నిలవడం ఖాయం. రామ్ చరణ్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయడం సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ దక్కేలా చేసింది. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
