టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాజాగా వివాదం(Controversy)లో చిక్కుకున్నారు. సూర్య హీరోగా నటించిన రెట్రో (Retro) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్, తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన గిరిజనుల(Tribals)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ లాయర్ కిషన్ చౌహాన్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈవెంట్ సందర్భంగా విజయ్ దేవరకొండ పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా గిరిజనులను ప్రస్తావిస్తూ “500 ఏళ్ల క్రితం గిరిజనులు ఎలా బుద్ధి లేకుండా ఘర్షణ పడ్డారో, కశ్మీర్‌లో ఇప్పటికీ టెర్రరిస్టులు అదేలా దాడులు చేస్తున్నారు” అనే విధంగా వ్యాఖ్యానించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీని మీద గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అభిమానులు, సామాజిక కార్యకర్తలు ఈ అంశంపై విభిన్నంగా స్పందిస్తున్నారు. గిరిజనుల భావోద్వేగాలను దెబ్బతీసేలా విజయ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కొందరు మండిపడుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో, సమస్య మరింత ఉత్కంఠంగా మారుతోంది. పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో చూడాలి.