Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. సూర్య తన 46వ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, సూర్య తదుపరి చిత్రం ఏ దర్శకుడితో అనేది కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సూర్య 47వ సినిమా కూడా తెలుగు దర్శకుడి చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
విడుదల కానున్న ‘కరుప్పు’
సూర్య నటించిన తదుపరి చిత్రం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన గ్రామీణ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’. ఈ చిత్రం 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా సూర్య తన రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం తెలుగు దర్శకులతో చురుగ్గా చర్చలు జరుపుతున్నారు.
Also Read: E Formula Case : మరోసారి కేటీఆర్ ను విచారించనున్న ఈడీ?
టాలీవుడ్ దర్శకులతో చర్చలు
‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు పరశురామ్ సూర్యతో ఒక కథా చర్చలు జరిపారనే వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ ఊహాగానాలు కొనసాగుతుండగానే.. టాలీవుడ్ నుంచి మరో ప్రతిభావంతుడైన దర్శకుడు, వివేక్ ఆత్రేయ, సూర్యను కలిసి ఒక కథను వివరించినట్లు తెలుస్తోంది.
వివేక్ ఆత్రేయ చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చిందని, దాని పట్ల ఆయన సానుకూల స్పందన చూపించారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో సూర్యతో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ చేసే సినిమా ఉంటుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌పై నటుడి నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివేక్ ఆత్రేయ ట్రాక్ రికార్డ్
వివేక్ ఆత్రేయ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇందులో నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం తర్వాత వివేక్ ఆత్రేయ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా కలిసి కథ చెప్పినా, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు సూర్యతో ఆయన చేసే అవకాశం ఉండటంతో వీరిద్దరి కలయికలో సినిమా వస్తే అది పాన్-ఇండియా స్థాయిలో పెద్ద విజయాన్ని సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
