BookMyShow : బుక్ మై షో.. ప్రముఖ మూవీ టికెటింగ్ పోర్టల్ అండ్ యాప్. ఈ పోర్టల్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్ రజని, కంపెనీ టెక్నికల్ హెడ్‌లను ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. బ్రిటీష్ రాక్ బ్యాండ్ టీమ్ ‘కోల్డ్ ప్లే’ వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 21 వరకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన టికెట్లు ఇప్పుడు జోరుగా అమ్ముడుపోతున్నాయి. ఈ డిమాండును అదునుగా చేసుకొని.. ‘కోల్డ్ ప్లే’ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించారనే అభియోగాలతో ఆశిష్ హేమ్ రజని, బుక్ మైషో టెక్నికల్ హెడ్‌లకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.
Also Read :Hurricane Helene : హెలెనా హరికేన్ బీభత్సం.. అమెరికాలో 44 మంది మృతి
దీనిపై న్యాయవాది అమిత్ వ్యాస్(BookMyShow) నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును మొదలుపెట్టింది. పోలీసుల సమన్లు అందుకున్న ఆశిష్ హేమ్ రజని, బుక్ మైషో టెక్నికల్ హెడ్‌లు ఇవాళ విచారణకు హాజరై తమ స్టేట్‌మెంట్లను అందించనున్నారు. వాస్తవానికి ‘కోల్డ్ ప్లే’ షోకు సంబంధించిన టికెట్ ధరను రూ.2,500గా నిర్ణయించారు. అయితే థర్డ్ పార్టీ సంస్థలు, కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ఒక్కో టికెట్‌ను రూ.3 లక్షలకు విక్రయిస్తున్నారని న్యాయవాది అమిత్ వ్యాస్ ఆరోపించారు. ఆయన అందించిన సమాచారం ఆధారంగా షో టికెట్లను భారీ ధరకు విక్రయిస్తున్న కొందరు బ్రోకర్లను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనిపై బుక్ మై షో పోర్టల్ నిర్వాహకులు పోలీసులకు ఈరోజు సంజాయిషీ ఇవ్వనున్నారు. ఈ పరిణామంపై ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన నేతలు స్పందించారు. బ్లాక్ మార్కెట్లో కోల్డ్ ప్లే టికెట్ల విక్రయంపై లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం ఏక్‌నాథ్ షిండేకు లేఖ రాశారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా దీనిపై స్పందిస్తూ.. కోల్డ్ ప్లే టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను కట్టడి చేయాలని కోరారు.