బాలీవుడ్‌ని దాటి చూద్దాం

భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే అనుకుంటారు. నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి పరిచయం ఉన్నది ఒక్క హిందీ సినిమా ఇండస్ట్రీనే. కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుపుతున్న ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఒక భాగం మాత్రమే.

  • Written By:
  • Updated On - October 12, 2021 / 12:34 PM IST

భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే అనుకుంటారు. నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి పరిచయం ఉన్నది ఒక్క హిందీ సినిమా ఇండస్ట్రీనే. కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుపుతున్న ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఒక భాగం మాత్రమే. నార్త్ ఇండియాకు ఒక్క హిందీ సినిమానే ఉందేమో కాని, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌లో సౌత్ ఇండియా సినిమాలదీ ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణాది సినిమాలు ఇప్పుడు వందల కోట్ల టర్నోవర్ సృష్టిస్తున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాల్లో దాదాపుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచే వస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్‌తో పాటు ప్రపంచమే మెచ్చుకుంటున్న బ్రహ్మాండమైన సబ్జెక్ట్, టెక్నికల్ సౌండ్‌తో సౌత్ ఇండియన్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకవిధంగా దక్షిణాది నుంచి విడుదలవుతున్న సినిమా సంఖ్య చాలా చాలా ఎక్కువ అని చెప్పాల్సి ఉంటుంది.

సౌత్ ఇండియా సినిమాలకే కాదు లొకేషన్లకు కూడా పెట్టింది పేరు. కథకు వాస్తవికత జోడించేందుకు దక్షిణాది లొకేషన్లనే ది బెస్ట్ కేరాఫ్ అడ్రస్. హాలీవుడ్ సినిమాలు సైతం నేచురాలిటీ కోసం ఇక్కడ షూటింగ్స్ చేసిన సందర్భాలు, సినిమాలు కోకొల్లలు. ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో ఇండియానే సెట్టింగ్‌గా వాడుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు పాండిచ్చేరి తీసుకోండి. ఇక్కడి ఇళ్ల నిర్మాణం, ఇక్కడి వాతావరణం చూస్తే అచ్చం ఫారెన్‌లో ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఆంగ్ లీ.. తన లైఫ్ ఆఫ్ పై సినిమా కోసం పాండిచ్చేరి లొకేషన్స్ తీసుకున్నాడు. రియాలిటీ కోసం ఇక్కడ దాదాపు 18 లొకేషన్లలో షూటింగ్ చేశాడు. ఒకప్పుడు ఫ్రెంచ్ ఇండియా క్యాపిటల్‌గా పాండిచ్చేరి ఉంది. ఇప్పటికీ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్‌లో నిర్మించిన ఇళ్లు, రోడ్లు, వీధి దీపాలు, ట్రవాక్స్ పబ్లిక్స్, ఈ తీరప్రాంత నగరంలో కనివిందు చేస్తూనే ఉంటాయి.

సౌత్ ఇండియాలో ఫిల్మ్ షూటింగ్స్ కి ప్రత్యేకంగా చెప్పుకోవిల్సింది గోవా. గొడుగుల కింద సన్ బాత్ చేసి సేదతీరుతున్న ఫారెనర్స్ సీన్లు కావాలంటే గోవాలోని పాలొలెమ్ బీచ్‌వెళ్లాల్సిందే. పామ్ ట్రీస్, బీచ్ హట్స్, ఫారెనర్స్ చూస్తుంటే ఇదసలు ఇండియానా, ఫారెన్ లొకేషనా అన్న అనుమానం వస్తుంది. అందుకే, హాలీవుడ్ సినిమాల్లో చాలా వరకు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. మ్యాట్ డామన్ నటించిన బార్నే సూమర్‌మాసీ సినిమాలో కొన్ని షాట్స్ గోవాలోనే షూట్ చేశారు. అంతేకాదు.. సూర్యరశ్మి కోసం పాకులాడే విదేశీయులకు.. గోవాలోని పాలొలెమ్‌లో ఉన్న బీచ్ రిసార్ట్స్ ఓ స్వర్గధామం లాంటిదని చెప్పొచ్చు. రిలాక్షేషన్ అంటే ఇక్కడే అన్నట్టుగా పాలొలెమ్ బీచ్‌కు క్యూ కడుతుంటారు.

ఇక సౌత్ ఇండియాలో మరో ఫేమస్ ఏరియా కర్నాటక. ఇక్కడి హంపి శిల్పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ గా పేరున్న జాకీ చాన్.. ది మిత్ సినిమా కోసం హంపిలో షూటింగ్ చేశారు. కేవలం నిన్న మొన్న వచ్చిన సినిమాలే కాదు.. 1984లోనే హాలీవుడ్ డైరెక్టర్లు ఇండియాలో షూటింగ్స్ చేశారు. అందులోనూ పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియాలో చిత్రీకరణ జరుపుకున్న సినిమాలున్నాయి. ద జువెల్ ఇన్ ద క్రౌన్ బ్రిటిష్ టీవీ డ్రామా కోసం 14 వారాల పాటు కర్నాటకలోనే షూటింగ్ చేశారు. మైసూర్ రాయల్ ప్యాలెస్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

పచ్చిక బయళ్ల వంటి సీన్స్ కావాలన్నా స్విట్జర్లాండ్ పరిగెత్తేవాళ్లు బాలీవుడ్ డైరెక్టర్లు. అలాంటి బాలీవుడ్ సైతం సౌత్ ఇండియా లొకేషన్స్ కోసం వెతికిన సందర్భాలు, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా లొకేషన్లలో షూటింగ్స్ జరుపుకున్న సినిమాలు బోలెడు ఉన్నాయి. షారుఖ్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ తమిళనాడు, బెంగళూరు, కేరళను చుట్టేసింది. మున్నార్ టీ ఎస్టేట్స్, వట్టమలై మురుగన్ గుడి, పంబన్ బ్రిడ్జ్ ఈ సినిమాలో ప్రముఖంగా కనిపిస్తాయి.
మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ సినిమా గురు సినిమా షూటింగ్ మున్నార్‌లోని అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరే జరిగింది. అక్షయ్ కుమార్ నటించిన రౌడీ రాథోడ్, 2007లో వచ్చిన నిశ్శబ్ద్ సినిమాలు మైసూరు దగ్గర్లోకి మెలుకొటేలో షూటింగ్స్ జరుపుకున్నాయి. ఫేమస్ ప్రేమకథా చిత్రం ఖయామత్ సె ఖయామత్ తక్ సినిమా ఊటీలోని పైన్ అడవుల్లో తీశారు. ఈ సినిమాలోని హీరోహీరోయిన్ల రొమాంటిక్ సీన్లను కోలార్ హిల్స్ లో చిత్రీకరించారు.

అవీ ఇవీ ఎందుకు ఇండియానే షేక్ చేసిన షోలె సినిమాలో గబ్బర్ సింగ్ చెప్పిన కిత్నే ఆద్మీతీ డైలాగ్ బెంగళూరు సమీపంలోని రామనగరలో షూట్ చేసిందే. బాలీవుడ్ సినిమాలకు ఎక్కువ మంది ప్రేక్షకులు ఉండొచ్చేమో. కాని, కలెక్షన్ల పరంగా రికార్డులు కొల్లగొడుతున్నవి మాత్రం సౌత్ సినిమాలే. అలాగని లొకేషన్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లడం లేదు. సౌత్ ఇండియన్ సినిమాలకు లొకేషన్లు సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంటున్నాయి. టాలీవుడ్ వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో, తమిళవాళ్లు తమిళనాడులో, కేరళవాళ్లు కేరళ లొకేషన్లలోనే షూటింగ్ పెట్టుకుంటున్నారు. బాహుబలి-2 సినిమానే ఇందుకు ఉదాహరణ. జస్ట్ 13 రోజుల్లోనే 194 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. ఇంత గొప్ప సినిమా షూటింగ్ జరిగింది కర్నూలు పరిసరాల్లోనే. దీంతో పాటు అత్తిరపల్లి ఫాల్స్, వలచల్ ఫాల్స్, మున్నార్-కోయంబత్తూరు మధ్యలో ఉన్న వల్పరాయ్ ప్రాంతంలో కొంత షూటింగ్ చేశారు.