2025వ సంవత్సరం ముగింపుకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రయాణాన్ని విశ్లేషిస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి వంటి అగ్ర కథానాయకుల చిత్రాలు ఈ ఏడాది విడుదల కాకపోవడం సినీ ప్రియులను కొంత నిరాశకు గురిచేసింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘అఖండ-2’ ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ భారీ వసూళ్లతో అలరించినప్పటికీ, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, నాని ‘హిట్-3’ వంటి చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద నిలకడైన విజయాన్ని అందుకున్నాయి. పెద్ద సినిమాల సందడి లేని ఈ లోటును చిన్న సినిమాలు తమ ప్రతిభతో భర్తీ చేయడం ఈ ఏడాది విశేషం.
2025 Little Hearts Movie
పెట్టుబడి మరియు రాబడి (ROI) కోణంలో లెక్కలు వేస్తే, 2025 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ‘లిటిల్ హార్ట్స్’ నిలిచింది. కేవలం రూ.2.5 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ‘ఈటీవీ విన్’ మద్దతుతో, ఆదిత్య హాసన్ నిర్మాణంలో సాయిమార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన మొదటి వారం నుండే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.30 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం, డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాసు మరియు వంశీ నందిపాటిలకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ చిత్ర విజయం యూట్యూబర్ మౌళి మరియు హీరోయిన్ శివాని కి ఓ పెద్ద బ్రేక్ ఇచ్చింది. కథలో బలం ఉంటే స్టార్ పవర్ లేకపోయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘లిటిల్ హార్ట్స్’ మరోసారి నిరూపించింది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ వంటి భారీ చిత్రాలు కలెక్షన్ల పరంగా పైన ఉన్నప్పటికీ, పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాల శాతాన్ని బట్టి చూస్తే ‘లిటిల్ హార్ట్స్’ రికార్డును మరే సినిమా అందుకోలేకపోయింది. ఈ ఏడాదిలో ‘కోర్ట్’ వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా మంచి ఫలితాలను సాధించడంతో, 2025 తెలుగు సినిమా పరిశ్రమలో కంటెంట్ ఆధారిత చిత్రాల సంవత్సరంగా నిలిచిపోనుంది.
