Site icon HashtagU Telugu

Tollywood : టాలీవుడ్ కు ‘పెద్ద‌దిక్కు’ కావలెను!

Chiru Mohanbabu

Chiru Mohanbabu

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు, రాజ‌కీయాల‌కు బ‌ల‌మైన సంబంధం ఉంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన త‌రువాత సినీ, రాజ‌కీయ రంగాల‌ను వేర్వేరుగా చూడ‌లేనంత‌గా క‌లిసిపోయాయి. ఆనాటి ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారానికి స్టార్ల‌ను దింపడం ఆన‌వాయితీగా మారింది. అధికారంలోకి వ‌చ్చిన పార్టీ అండ‌తో ఆస్తుల‌ను పెంచుకోవ‌డానికి ముఖ్య‌మంత్రుల వ‌ద్ద న‌టులు క్యూ క‌ట్ట‌డం కూడా స‌హ‌జంగా మారింది. కొన్ని ద‌శాబ్దాలుగా ఇలాంటి ప‌రిస్థితిని చూస్తున్నాం. కానీ, ఇప్పుడు సీన్ మారింది…కాదుకాదు..జ‌గ‌న్ మార్చేశాడు. సినీ న‌టులను ఎక్క‌డ ఉంచాలో..అక్క‌డే ఉంచుతున్నాడు. వాళ్ల‌తో రాజ‌కీయాలను చేయొచ్చ‌నే భావ‌న‌కు చెక్ పెట్టాడు.2019 ఎన్నిక‌ల ముందుగా జ‌గ‌న్ చేసిన పాద‌యాత్రకు సినీ పరిశ్ర‌మ దాదాపుగా దూరంగా ఉంది. సీఎం అయిన త‌రువాత కూడా సినీ పెద్ద‌ల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. హీరోలు, ప్ర‌ముఖ నిర్మాత‌లు సైతం కొంత‌కాలం సీఎం జ‌గ‌న్ కు దూరంగా ఉన్నారు. ఆ త‌రువాత మీడియాలో వ‌చ్చిన వార్త‌ల క్ర‌మంలో చిరంజీవి అండ్ టీం క‌లిసి జ‌గ‌న్ కు అభినంద‌న‌లు తెలిపింది. ప‌నిలోప‌నిగా సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు ల‌బ్ది చేయాల‌ని భూముల‌ను అడిగార‌ట‌. అంతేకాదు, టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని అభ్య‌ర్థించార‌ట‌.

సినీ హీరోల‌ అభ్య‌ర్థ‌న మేర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఆ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ తొలిసారి జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గం మీద గ‌ళం విప్పాడు. రాజ‌కీయ కోణాన్ని సినిమా టిక్కెట్ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విధానానికి రంగ‌రించాడు. ఆనాటి నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి, సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. హైకోర్టులోనూ దీనిపై వాద‌ప్ర‌తివాద‌న‌లు జరుగుతున్నాయి. ఫ‌లితంగా పెద్ద హీరోల సినిమాలు త్రిబుల్ ఆర్‌, బీమ్లానాయ‌క్, ఆచార్య‌, రాధేశ్యామ్ సినిమాల విడుద‌ల నిలిచిపోయి. ఇలాంటి సందిగ్ధ ప‌రిస్థితికి చెక్ పెట్ట‌డానికి హీరో మంచు మోహ‌న్ బాబు రంగంలోకి దిగాడు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేఖ ద్వారా సినీ బాధ‌ల‌ను తెలియ‌చేశాడు.
ఏపీ సర్కార్ పై యుద్ధాన్ని హీరో ప‌వ‌న్ ప్రారంభించ‌గా, దానికి ముగింపు ప‌లికేందుకు మోహ‌న్ బాబు రంగంలోకి దిగాడు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం పెద్ద‌రికం వ‌ద్దంటూ చేతులెత్తేశాడు. ప‌రిశ్ర‌మ బిడ్డ‌గా మాత్ర‌మే ఉంటాన‌ని తేల్చేశాడు. పెద్ద‌రికం వ‌ద్దంటూ దండం పెట్టాడు. డాక్ట‌ర్ దాస‌రి మాదిరిగా చిరంజీవి పెద్ద‌రికం వ‌హించాల‌ని కార్మికులు కోరిన‌ప్పుడు వ‌ద్దంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు. ఆ న‌లుగురు చేతిలో సినీ ప‌రిశ్ర‌మ ఉంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి క్లారిటీ ఇచ్చేలా మోహ‌న్ బాబు ఏపీ సీఎం జ‌గ‌న్ కు లేఖ రాశాడు. చిన్నా, పెద్ద సినిమాలను బ‌తికించ‌డంటూ అభ్య‌ర్థించాడు. సీఎం జ‌గ‌న్ బంధువుగా ఉన్న హీరో మోహ‌న్ బాబు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలని భావించాడు. లేఖ రూపంలో రంగంలోకి దిగాడు.

డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర‌హాలో సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కు చిరంజీవి ఇటీవ‌ల ఫోక‌స్ అయ్యాడు. అందుకోసం అవ‌స‌ర‌మైన ప్ర‌చారాన్ని త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ చేశార‌ని టాలీవుడ్ టాక్. మెగా అభిమానులు కూడా దాస‌రి త‌ర‌హాలో చిరంజీవి అంటూ ఫిక్స్ అయ్యారు. తెలంగాణ‌, ఏపీ సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌డాన్ని చూసిన వాళ్లు దాస‌రి వార‌సునిగా చిరుని భావించారు. ఆ మేర‌కు అడుగులు దూకుడుగా ప‌డ్డాయి. హ‌ఠాత్తుగా ఇప్పుడు చిరంజీవి పెద్ద‌ దిక్కుగా ఉండ‌లేన‌ని తేల్చాసాడు. డాక్ట‌ర్ దాస‌రి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి ఆయ‌న సాహ‌సించ‌లేకపోయాడు. కేవ‌లం సినీ ప‌రిశ్ర‌మ బిడ్డ‌గానే ఉంటానుగానీ పెద్ద దిక్కుగా ఉండ‌లేన‌ని చేతులెత్తేశాడు. సో..మొత్తం మీద ఏపీ సీఎం జ‌గ‌న్ హీరోల కోర‌లు పీకేశాడ‌న్న‌మాట‌!

Exit mobile version