‘తగ్గితే తప్పేముంది’ అంటాడో ఓ హీరో. కొన్ని పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు తగ్గితేనే మంచిది దాని అర్థం. ఈ డైలాగ్ ‘భీమ్లానాయక్’ సినిమాకు అతికినట్టుగా సరిపోతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ‘ఆర్ఆర్ఆర్’.. ‘రాధేశ్యామ్’తో పాటు ‘భీమ్లా నాయక్’ను విడుదల చేయాలని ఆయా చిత్ర నిర్మాతలు భావించారు. అయితే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు పాన్ ఇండియాగా తెరకెక్కాయి. సుదీర్ఘం కాలంగా షూటింగ్ జరుపుకున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువ స్క్రీన్స్ అవసరం ఉంటాయి.
ఒకేసారి మూడు చిత్రాలు విడుదల అయితే థియేటర్లు దొరకడం చాలా కష్టం. దీంతో భీమ్లానాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో భీమ్లానాయక్ రిలీజ్ ను వాయిదా వేయాలని చిత్ర నిర్మాతలను రిక్వెస్ట్ చేశాం. భీమ్లానాయక్ టీం సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరి 25న విడుదల చేయాలని భావించామని ఆయన అన్నారు. అయితే భీమ్లానాయక్ వెనక్కి తగ్గడంతో ‘ఏఫ్ 3’ సినిమా విడుదల తేదీ కూడా మారనుంది.
సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. నిత్యా మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.