Paruthiveeran Issue: తమిళ సినీ పరిశ్రమలో కొద్దిరోజులుగా దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ ల మధ్య వివాదం జరుగుతోంది. హీరో కార్తీ నటించిన తొలి సినిమా పరుత్తివీరన్(2007) బడ్జెప్ పై తలెత్తిన ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పుడీ వివాదం కోలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. పరుత్తి వీరన్ సినిమా గురించి కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ అమీర్ పై.. నిర్మాత జ్ఞానవేల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ సినిమా విషయంలో అమీర్ ఎక్కువగా ఖర్చు చేశాడని.. తన అవసరాలకు వాడుకున్నాడని.. సినిమాకు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే.. కావాలనే ఎక్కువగా డబ్బును ఉపయోగించాడని జ్ఞానవేల్ ఆరోపించాడు.
అమీర్ పై జ్ఞానవేల్ చేసిన ఆరోపణలను పలువురు దర్శకులు ఖండిస్తూ.. అమీర్ కు తమ మద్దతు తెలుపుతున్నారు. నిర్మాత శశికుమార్, నటుడు సముద్రఖని, సుధా కొంగర, నటుడు పొన్వన్నన్ , సూర్య – కార్తీ తండ్రి శివకుమార్, డైరెక్టర్ కుర పళియప్పన్ తదితరులు మద్దతు తెలుపగా.. ఇప్పుడు డైరెక్టర్ భారతీరాజా కూడా అమీర్ కు మద్దతిస్తూ.. అతనికి క్షమాపణలు చెప్పాల్సిందేనని పేర్కొంటూ.. ఒక నోట్ షేర్ చేశారు.
పరుత్తివీరన్ సినిమాపై జ్ఞానవేల్ మాట్లాడిన వీడియోను తాను చూశానన్న భారతీ రాజా.. సినిమా నిర్మాణం విషయంలో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు కానీ.. ఒక గొప్ప క్రియేటర్ ను, పేరును, ప్రతిష్టను, కృషిని దిగజార్చేలా మాట్లాడటం ఖండించాల్సిన విషయమన్నారు. పరుత్తివీరన్ కంటే ముందే అమీర్ రెండు సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించారని.. కానీ ఈ సినిమాతోనే అతను పని నేర్చుకున్నాడని చెప్పడం తనలాంటి క్రియేటర్లను అవమానించడమేనన్నారు. నిజమైన క్రియేటర్స్ చనిపోయేంతవరకూ నేర్చుకుంటూనే ఉంటారన్నారు. ఒక గొప్ప క్రియేటర్ ను, అతని పనిని, చిత్తశుద్ధిని అవమానించినందుకు అతడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.