Site icon HashtagU Telugu

Kanan Devi : వేశ్యాగృహం దగ్గరిలో జీవనం చేసి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగి .. రూ.5 నుంచి 5 లక్షల సంపాదన వరకు.. కానీ..!

Bengali Actress and singer Kanan Devi life story

Bengali Actress and singer Kanan Devi life story

బెంగాలీ(Bengali) నటి కానన్‌ దేవి(Kanan Devi).. బెంగాలీ తెర ప్రథమ మహిళగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే నటిగా, సింగర్‌(Singer)గా సినీ రంగంలోకి అడుగుపెట్టి పురుషాధిపత్యం ఉన్న రోజుల్లో మకుటం లేని మహారాణిగా వెండితెరపై నిలిచారు. పశ్చిమ బెంగాల్‌(West Bengal) లోని హౌరాలో ఒక నిరుపేద కుటుంబంలో 1916 ఏప్రిల్‌ 22న కానన్‌ దేవి జన్మించారు. ఆమెది సంగీత కుటుంబం. దీంతో చిన్నతనం నుంచే తండ్రి దగ్గర సంగీత సాధన చేస్తూ వచ్చారు. అయితే కానన్‌ దేవి ఆరేళ్ళ వయసు సమయంలో ఆమె తండ్రి మరణించారు. దీంతో ఆర్థిక కష్టాలతో కుటుంబం రోడ్డున పడింది.

ఇంటి అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమాన్ని తల్లీకూతుళ్లని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఏమి చేయలేని పరిస్థితిలో ధనవంతుల ఇళ్లల్లో తల్లీకూతుళ్లు ఐదారు పనిమనుషులుగా చేరారు. అయితే ఇంతలో వారి బంధువు ఒకరు వచ్చి సాయం చేస్తాను అని చెప్పి తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చాడు. తనని దేవుడు అనుకునేలోపే తన నిజస్వరూపం చూపించాడు. ఆరేళ్ళ కానన్ మరియు ఆమె తల్లితో బండచాకిరీ చేయించుకునేవాడు. అంతేకాదు వారితో అసభ్యంగా కూడా ప్రవర్తించేవాడు. దీంతో సహించలేకపోయిన వారు ఆ ఇంటి నుంచి బయటకి వచ్చేశారు.

అలా బయటకి వచ్చి వేశ్యాగృహాల సమీపంలో ఒక గదిని అద్దె తీసుకుని జీవించారు. ఆ తరువాత తమ కుటుంబ స్నేహితుడైన తులసి బెనర్జీ అనే వ్యక్తి.. కానన్‌ను సినిమాల్లో రాణించగలదని గ్రహించి ఆమెను సినిమాలు వైపు తీసుకు వెళ్ళాడు. అప్పుడు ఆమె వయసు 10 ఏళ్ళు. ప్రముఖ మదన్‌ మూవీ స్టూడియో ‘జైదేవ్‌’ అనే చిత్రంలో కానన్ కి ఆఫర్‌ ఇచ్చింది. కానన్‌ అప్పుడు అందుకున్న నెల జీతం రూ.5. బాలనటిగానే కాదు సింగర్ కూడా పలు సినిమాలో రాణించారు. 1928 నుండి 1931 వరకు పలు సినిమాల్లో బాలనటిగా చేశారు.

ఆ తరువాత 21 ఏళ్ళ వయసులో హీరోయిన్ గా పరిచయం అయిన కానన్.. తక్కువ సమయంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఒక పాట పడితే 1 లక్ష, హీరోయిన్ గా చేసినందుకు 5 లక్షలు పారితోషకం అందుకున్నారు. కానన్ తన కెరీర్ మొత్తం మీద 57 సినిమాలు చేయగా, 40 పాటలు పాడారు. పురుషాధిపత్యం కనిపిస్తున్న రోజుల్లో ఇండస్ట్రీలో ‘మేడమ్‌’ అని పిలిపించుకున్న మొదటి నటి కానన్.

ఇక ఈమె దాంపత్య బంధాన్ని విషయానికి వస్తే.. 1940లో అశోక్‌ మిత్రా అనే వ్యక్తిని పెళ్లాడారు. కానీ పెళ్లైన ఐదేళ్లకే వీరిద్దరూ విభేదాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత బెంగాల్‌ గవర్నర్‌ దగ్గర ఏడీసీగా వర్క్ చేస్తున్న హరిదాస్‌ భట్టాచార్జిని 1949లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత హరిదాస్ దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. అయితే తనని అందరూ కానన్ భర్త గానే చూస్తున్నారు అనే కోపంతో 1987లో ఆమె నుంచి దూరంగా వచ్చేశాడు హరిదాస్.

విడాకులు తీసుకోనప్పటికీ ఇద్దరు విడివిడిగానే జీవనం సాగించారు. కానన్‌ దేవి 76 ఏళ్ల వయసులో 1992 జూలై 17న అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పుడు కూడా హరిదాస్ ఆమెను చూడడానికి రాకపోవడం గమనార్హం. ఇక చిత్రపరిశ్రమకు కానన్‌ దేవి అందించిన సేవలను గుర్తించి 2011లో తపాలా శాఖ ఆమె పేరిట ఒక ఓ స్టాంపును విడుదల చేసింది.

 

Also Read : Sai Dharam Tej : మళ్ళీ ఆరు నెలలు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్న సాయి ధరమ్ తేజ్..