టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) రాంగ్ రూట్‌లో ప్రయాణించడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు (Jubilee Hills police have registered a case.) చేశారు. మే 13న మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 నుంచి జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్లే సమయంలో ఆయన రాంగ్ రూట్‌లో తన ఇంటికి వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఈ క్రమంలో ఆయన కారును అడ్డుకోవడంతో, బెల్లంకొండ అతనితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీలుగా ఉండి సామాన్యుల కంటే బాధ్యతగా ప్రవర్తించాలి గానీ, ఇలా పోలీసులతోనే అరాచకంగా వ్యవహరించడం తగదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రముఖులగా ఉండే వ్యక్తులు ఇలా వ్యవహరించడం సమాజానికి తప్పుదారి చూపించడమేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు మే 15న బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. పోలీసుల పిలుపుకు స్పందించిన శ్రీనివాస్ స్టేషన్‌కు హాజరయ్యారు. అలాగే ఆయన వాడిన కారు కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రానికి ఈ ఘటన మరోసారి నిదర్శనంగా నిలుస్తోంది.