నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన చిత్రం (NBK112) గురువారం (జూన్ 25) లాంఛనంగా ప్రారంభం కానుంది. అమరావతిలో నేడు ఉదయం జరగనున్న ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్, యువసుధ ఆర్ట్స్ నిర్మాతలు ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతి వేదికగా జరుగుతున్న తొలి భారీ సినీ వేడుక కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
మాస్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలకృష్ణ, సామాజిక సందేశాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన కొరటాల శివ తొలిసారిగా చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఏ మూవ్‌మెంట్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.
బాలకృష్ణ అల్లుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ వేడుకకు హాజరుకానుండటంతో, ఈ కార్యక్రమం అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
