Chiranjeevi Vs Balakrishna : తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా బాక్సాఫీస్ యుద్ధానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి మధ్య సాగే సంక్రాంతి పోరు అంటేనే అభిమానులకు అసలైన పండుగ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు పోటీ పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
సంక్రాంతి సమరం: గ్యాంగ్‌స్టర్లుగా చిరు, బాలయ్య!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలకృష్ణల పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. విశేషమేమిటంటే, ఈసారి వీరిద్దరూ ఒకే తరహా ‘గ్యాంగ్‌స్టర్’ కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగనుండగా, అటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమా కూడా అదే జానర్‌లో ఉండబోతోందని టాక్. ఒకే పండుగ సీజన్‌లో, ఒకే తరహా కథలతో ఇద్దరు అగ్ర హీరోలు ఢీకొనబోతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ తరహా పోటీ గతంలోనూ సినీ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా 2023 సంక్రాంతి సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ (బాలయ్య – గోపీచంద్ మలినేని), ‘వాల్తేరు వీరయ్య’ (చిరంజీవి – బాబీ) చిత్రాలు ఒకరోజు వ్యవధిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. రెండు చిత్రాలు ఘనవిజయం సాధించి గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం విశేషం. ఇప్పుడు అదే కాంబినేషన్లు రిపీట్ అవుతుండటంతో, 2027 సంక్రాంతికి కూడా అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
గతంలో చిరంజీవి ‘లంకేశ్వరుడు’, ‘గూండా’ వంటి చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించగా, బాలయ్య ‘యువరత్న రాణా’, ‘అశోక చక్రవర్తి’ సినిమాల్లో తన మాస్ పవర్ చూపించారు. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా నవతరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా బాబీ, గోపీచంద్ మలినేని ఈ సీనియర్ స్టార్లను ఏ రీతిన ప్రజెంట్ చేస్తారో చూడాలన్న కుతూహలం అందరిలోనూ నెలకొంది. ఈ ‘గ్యాంగ్‌స్టర్ వార్’లో ఈసారి ఎవరిది పైచేయి అవుతుందోనని మెగా, నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు.
