Site icon HashtagU Telugu

Floods in AP & Telangana : తెలుగు రాష్ట్రాలకు కోటి సాయం ప్రకటించిన బాలయ్య

Balakrishna

Balakrishna

తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు (Floods in AP & Telangana) అపార నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు ప్రభుత్వాలు , రాజకీయ పార్టీలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని ఇరు సీఎంలు కోరడం తో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. గతంలో పలు విపత్తులు ఎదురైనప్పుడు తమ వంతు సాయం చేసిన చిత్రసీమ..ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల కోసం తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు , నిర్మాతలు , డైరెక్టర్లు తమ వంతు సాయం ప్రకటించగా..తాజాగా సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna ) రెండు రాష్ట్రాలకు కోటి రూపాయిల సాయాన్ని (Donates Rs 1 crore) ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vijayanthi Movies) ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘ఆయ్‌’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) సైతం తెలుగు రాష్ట్రాల‌ వ‌ర‌ద‌ల‌పై స్పందిస్తూ త‌మ సానుభూతి తెలియ‌జేశారు. ‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ‌ర‌ద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున‌ విరాళం అందజేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, ఎస్‌. రాధాకృష్ణ‌, ఎస్ నాగ‌వంశీలు సంయుక్తంగా త‌మ హారిక‌, హ‌సిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ త‌రుపున ఆంద్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 ల‌క్ష‌లు, తెలంగాణ‌లకు రూ.25 ల‌క్ష‌ల చొప్పున మొత్తంగా రూ.50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. జూ. ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు ప్రకటించారు. వీరి బాటలోనే మిగతా హీరోలు , నిర్మాతలు కూడా తమ వంతు సాయం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు.

Read Also :  Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్