Site icon HashtagU Telugu

Chiranjeevi: అయోధ్య రామమందిర ప్రారంభానికి సెలబ్రిటీలకు ఆహ్వానం.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్.!

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: 2024 జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రపంచంలోని పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుతున్న 18 మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, అరుణ్ గోవిల్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాతలు మహావీర్ జైన్, రోహిత్ శెట్టి వంటి వారికి ఆహ్వానం అందింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, ధనుష్, కాంతారావు ఫేమ్ రిషబ్ శెట్టికి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మాత్రమే ఆహ్వానం అందింది.

సినీ పరిశ్రమకు చెందిన అటువంటి వ్యక్తులతో సమన్వయం చేస్తున్న సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పవిత్రోత్సవానికి హిందీ, సౌత్‌, పంజాబ్‌, బెంగాల్‌, తెలుగు చిత్ర పరిశ్రమల నుంచి 18 మంది ప్రత్యేక ప్రతిభావంతులను ఆహ్వానించాం. తొలి దశ పేర్లను తాజాగా విడుదల చేశారు. త్వరలోనే పంజాబ్, బెంగాల్ నుండి వచ్చే వ్యక్తుల పేర్లను కూడా వెల్లడిస్తామన్నారు.

Also Read: Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్

ఈ కార్యక్రమాన్నీ గుర్తుండిపోయేలా చేయడానికి ఇతర రంగాల వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. అదే పరంపరలో సినీ పరిశ్రమ నుంచి విశేష కృషి చేసిన వారిని కూడా ఆహ్వానించాలని సూచనలు చేశారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖులంతా అయోధ్యకు రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ఆహ్వానం అందినవారు జనవరి 21లోపు అయోధ్యను సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు. మీరు ఎంత త్వరగా అయోధ్యకు వస్తారో.. మీకు అంత సౌలభ్యం కలుగుతుంది. మీరు ఆలస్యంగా వచ్చినట్లయితే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆహ్వాన పత్రికలో రాసి ఉంది. ఈ లేఖ చివర శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సంతకం కూడా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ట్రస్ట్ ప్రకారం.. రెండు లక్షల మందికి పైగా రామభక్తులు సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా 4 లక్షల గ్రామాల్లోని దేవాలయాల్లో కూడా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఆలయాల్లో రామనామ సంకీర్తన నిర్వహిస్తారు. అనంతరం అందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు. దీనితో పాటు వేడుక ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. తద్వారా కోట్లాది మంది భక్తులు ఈ చారిత్రాత్మక క్షణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.