Gaddar Awards : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రముఖ సినీ కళాకారులకు గద్దర్ అవార్డులు అందించి, సినీ రంగాన్ని గౌరవించడం పట్ల ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అవార్డులు తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు అందించడమూ, కళాకారులను గౌరవించడమూ అభినందనీయం. ఏపీలోనూ ఇలాంటి సన్మానాలు జరగాలి. ఇది సినీ సృజనాత్మకతకు ప్రోత్సాహంగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో హరిహర వీరమల్లు సినిమాను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న వివాదాలపై నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు. హరిహర వీరమల్లుకు సంబంధించి కుట్ర జరుగుతోందన్న మాటలు అనవసరం. ఒక సినిమాతో కలిపి ఇండస్ట్రీ సమస్యలను కలపడం సరైన దారి కాదు. పర్సంటేజీ వ్యవహారం గత 25 ఏళ్లుగా ఉంది. దాన్ని ఇప్పుడు ఒక్క సినిమాతో లింక్ చేయడం సబబుకాదు, అని చెప్పారు.
Read Also: Loretta Swit : ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత
పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా నారాయణమూర్తి స్పందించారు. థియేటర్లు బంద్ చేస్తున్నారన్న వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. థియేటర్లు మూసేస్తే కనీసం మూడు వారాల ముందే ప్రకటిస్తారు. ఇంకా ఎవరూ అధికారికంగా అలాంటి ప్రకటన చేయలేదు అని చెప్పారు. పర్సంటేజీ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, చిన్న నిర్మాతలు, సింగిల్ థియేటర్లు బతకాలంటే ఇది అవసరమని తెలిపారు. ఇది పాత సమస్య. మేమూ ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వద్దకు వెళ్ళాం. రామానాయుడు గారు మాటిచ్చారు కానీ ఆయన మరణించారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి ప్రముఖులను కలిసి పర్సంటేజీ పై సహకరించమన్నాం. కానీ ఫలితం రాలేదు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై స్పందిస్తూ పవన్ గారు తాజాగా డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇండస్ట్రీ వారిని ఆయనే కలిసి సమస్యలు అడిగి పరిష్కరించాలని ఉండాలి. గతంలో రాజులు ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడేవారు. ఇప్పుడు కూడా అలాగే జరిగితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. చివరిగా, పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి చేస్తూ నారాయణమూర్తి చెప్పారు. పర్సంటేజీ వ్యవస్థను పక్కన పెట్టకుండా దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇది చిన్న నిర్మాతల ప్రాణాధారం. ఈ సమస్యపై మీరు చొరవ చూపాలి.