బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2020 సంవత్సరానికి ఆమెకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్లు పేర్కొన్నారు. 79 ఏళ్ల వయసున్న ఆమెను 1992లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.68వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30న ఆషాకు ఫాల్కే అవార్డును కేంద్రం అందజేయనుంది. అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు ఆషా పరేఖ్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ కమిటీలో ఆషా భోంస్లే, హేమామాలిని, పూనమ్ దిల్లాన్, ఉదిత్ నారాయణ్, టీఎస్ నాగాభరణ ఉన్నారు.
ఆషా పరేఖ్ 95 చిత్రాల్లో నటించారు. దిల్ దేకే దేకో, కటీ పతంగ్, తీస్రీ మంజిల్, బహారోంకే సప్నే, ప్యార్ కా మౌసమ్, కారవాన్ లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. 1952లో రిలీజైన ఆస్మాన్ చిత్రంలో ఆమె బాలనటిగా చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు బాప్ బేటి చిత్రంలో నటించారు. ఘోరా కాగజ్ టీవీ షోలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. గతంలో రాజ్ కపూర్, అక్కినేని నాగేశ్వరరావు, బీఎన్ రెడ్డి, ఎల్వీ ప్రసాద్, బి.నాగిరెడ్డి, కె.విశ్వనాధ్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా తదితరులు అందుకున్నారు. 1969లో మొదటిసారిగా దేవికా రాణి అందుకోగా, 2019కి రజనీకాంత్ అందుకున్నారు.