Arijit Singh: బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అర్జిత్ సింగ్ ఇకపై ప్లేబ్యాక్ సింగింగ్ (సినిమాల్లో పాటలు పాడటం) చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అర్జిత్ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే అది చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ అర్జిత్ తన పోస్ట్‌లో ఏం రాశారో చూద్దాం.
అర్జిత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాశారు. “హలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రోతలుగా ఇన్నాళ్లుగా నాకు ఇంతటి ప్రేమను అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపై నేను ప్లేబ్యాక్ వోకలిస్ట్‌గా ఎటువంటి కొత్త ప్రాజెక్టులను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా ప్లేబ్యాక్ సింగింగ్ ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం” అని పేర్కొన్నారు.
Also Read: ఇరుముడి మూవీ.. రవితేజ కెరీర్‌కు ప్లస్ అవుతుందా?!
విడుదలైన అర్జిత్ సింగ్ పాట ‘మాతృభూమి’
అయితే ఇప్పటికే తాను ఒప్పుకున్న, పైప్‌లైన్‌లో ఉన్న ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేస్తానని అర్జిత్ స్పష్టం చేశారు. దీని అర్థం ఏమిటంటే.. ఇప్పటికే రికార్డ్ అయిన లేదా పని జరుగుతున్న పాటలు ఈ ఏడాది విడుదలవుతాయి. కాబట్టి అభిమానులు ఈ సంవత్సరం ఆయన గొంతును వినే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల అర్జిత్ సింగ్ పాడిన కొత్త పాట ‘మాతృభూమి’ విడుదలైంది. దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ సినిమా కోసం ఆయన ఈ పాటను పాడారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది.
