టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న గొడవలు (Manchu Family Fight) ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మనోజ్ – మోహన్ బాబు (Mohan Babu Vs Manoj) ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేసుకున్నారు. వీరి మధ్య వివాదానికి కారణం జల్పల్లి నివాసం (Mohan babu House Jalpally) గురించే అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. మోహన్ బాబు తన శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపడం కోసం జల్పల్లిలో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. సకల సౌకర్యాలు కలిగిన ఈ ఇల్లు ప్రస్తుతం కోట్లాది రూపాయల విలువ కలిగి ఉంది.
ఈ ఇల్లు ప్రస్తుతం మంచు మనోజ్ తన స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని కొన్ని వర్గాల ఆరోపణ. గతంలో ఫిల్మ్ నగర్లోని ఇంటిని మంచు లక్ష్మీ ప్రసన్నకు అప్పగించిన మోహన్ బాబు, జల్పల్లి ఇంటిని మాత్రం తనకంటూ ప్రత్యేకంగా ఉంచుకున్నారు. అయితే, ఈ ఇంటిపై ఇప్పుడు తండ్రి , కొడుకు మధ్య వివాదం నడుస్తుందని అంటున్నారు. ఇటీవల మంచు మనోజ్, మోహన్ బాబు ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఈ చిచ్చు ఇళ్ల వివాదంతో ముడిపడిందా అనే సందేహం జనంలో ఉత్కంఠ పెంచుతోంది. అందులోనూ, మంచు మనోజ్ ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవాలన్నది ఆరోపణలు మాత్రమేనని అంటున్నారు. ఈ వివాదం మంచు కుటుంబం ప్రతిష్టను దిగజారుస్తుంది. గతంలో కూడా విష్ణు – మనోజ్ ల మధ్య గొడవ జరగడం..కొట్లాటల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తండ్రి – కొడుకుల మధ్య వివాదం నడుస్తుంది.
మోహన్ బాబు తనపై పెట్టిన ఫిర్యాదు పట్ల మనోజ్ స్పందించారు.తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని మనోజ్ అన్నారు. ‘కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబం దూరంగా ఉంటోంది. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. అందులోని బాధితులకు నేను అండగా ఉన్నాను. అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని , తన తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉన్నారని మనోజ్ అన్నారు. ‘నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం, పరువు నష్టం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు. నేను 4నెలల కిందటే ఇంటికి వచ్చాననేది అవాస్తవం. నా ఫోన్ లొకేషన్ చూస్తే ఇది తెలుస్తుంది. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. నా పరువు, మర్యాదలు తీసే ప్రయత్నంలో భాగం’ అని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం విష్ణు కూడా దుబాయ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. త్వరలోనే తమ కుటుంబంలోని ఈ గొడవలు సర్దుమణుగుతాయి అని పేర్కొన్నారు.
Read Also : Tummala Nageswara Rao : తెలంగాణలో నేతన్నలకు గుడ్ న్యూస్.. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్లు