MM Keeravani: ‘నా సామిరంగ’ నాగార్జున గారికి యాప్ట్ టైటిల్, సంక్రాంతి కళ ఉట్టిపడేలా ఉంటుంది!

  • Written By:
  • Updated On - January 8, 2024 / 07:46 PM IST

MM Keeravani: కీరవాణి అనగానే ఎన్నో అద్భుతమైన సినిమాలు గుర్తుకువస్తాయి. అంతకుమించి మంచి మంచి మ్యూజికల్ ఆల్బమ్స్ వెంటనే మదిలో మెదులుతాయి. ఆయన ఏదైనా సినిమా ఒప్పుకుంటే.. ఖచ్చితంగా ఆ సినిమా దాదాపు హిట్ అనే టాక్ ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

విజయ్ బిన్నీ మీకు నచ్చిన అంశాలు?

క్యాలిటీ తగ్గకుండా తొందరగా సినిమా తీయడం తన ప్రధాన బలం అని భావిస్తున్నాను. తను డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ప్రతి పాట డ్యాన్స్ కోణంలో అలోచించడం సహజం. కానీ దానికి భిన్నంగా ఇందులో చాలా మంచి మూడు మెలోడీస్ చేయించారు. తను పరిపక్వత వున్న దర్శకుడనిపించింది.

నాగార్జునతో పనిచేయడం ఎలా ఉంది?

నాగార్జున గారితో పని చేయడం నాకు అలవాటైన విద్య. మా కాంబినేషన్ ఎప్పుడూ విజయం సాధిస్తూ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. కొత్త దర్శకుడు బిన్నీ ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకులు ఎలాగైనా నిరూపించుకోవాలనే కసితో పని చేస్తారు.

గతంలో నాగార్జున భక్తీ సినిమాలకు పనిచేశారు.. మరి నా సామిరంగ ఎలా అనిపించింది?

-ప్రెసిడెంటు గారి పెళ్ళాం ఎంతటి ఘన విజయం సాధించిందో నా సామిరంగ కూడా అలాంటి విజయం అందుకుంటుంది. ప్రెసిడెంటు గారి పెళ్ళాం విలేజ్ నేపధ్యం వున్న సినిమా. ఇది కూడా అంతే. అందులో ఎన్ని రకాల వినోదాత్మకమైన అంశాలు ఉంటాయో ఇందులో కూడా అన్నీ వుంటాయి. ఇది మరో ప్రెసిడెంటు గారి పెళ్ళాం అవుతుందని ఆశిస్తున్నాను. ‘నా సామిరంగ’ నాగార్జున గారికి యాప్ట్ టైటిల్. తెలుగు సాంప్రదాయం, మన కట్టుబాట్లు, నేటివిటీ, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీతం కూడా ఫ్రెష్ గా వుంటుంది.

మంచి పాటలు చాలామందికి చేరవు. దానికి కారణాలు?

-పాట వైరల్ అవ్వడం అనేది మన చేతిలో లేదు. ఒకప్పుడు పాట హిట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఏదైనా పెళ్లికి వెళ్లి.. అక్కడ బ్యాండ్ లో ఆ పాట ప్లే చేస్తున్నారా లేదా అన్నదాని బట్టి తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు వ్యూస్ ని బట్టి తెలుస్తోంది. నిజాయితీగా పని చేయడం మాత్రమే మన చేతిలో వుంది. వైరల్ అనేది మన చేతిలో లేదు.